Tuesday, April 30, 2024

శరత్‌చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్.. నానమ్మ కర్మకాండల కోసం వెసులుబాటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టై తిహార్ జైల్లో ఉన్న వ్యాపారవేత్త శరత్‌చంద్రారెడ్డికి ఊరట లభించింది. శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులో ఉన్న స్పెషల్ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 14 రోజుల పాటు ఈ బెయిల్ అమల్లో ఉంటుంది. ఇందుకోసం రూ. 2 లక్షల పూచీకత్తు సమర్పించాలని షరతుల్లో పేర్కొంది. జనవరి 25న సాయంత్రం తన నానమ్మ చనిపోయిందని, అంత్యక్రియలు – కర్మకాండలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ శుక్రవారం శరత్ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.

జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ ఎదుట ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. శరత్ తండ్రి విదేశాల్లో ఉండేవారని, నానమ్మ దగ్గరే ఆయన పెరిగారని న్యాయవాది తెలిపారు. ఆమెతో ఉన్న అనుబంధం, ఆమె చివరి కోరికను తీర్చడం కోసం మతపరమైన కర్మకాండలు నిర్వహించడం కోసం రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. శరత్‌చంద్రారెడ్డి తరఫు న్యాయవాది వాదనలపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి 2 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసాయి. దానిపై న్యాయస్థానం తదుపరి విచారణ తేదీ నాటికి నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement