Friday, April 26, 2024

ద్రవ్యోల్బణం గరిష్టానికి.. ధరలకు ఇక రెక్కలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ద్రవ్యోల్బణం దద్ధరిళ్లుతోంది. పెరిగిన కనీస సరుకులు, నిత్యావసరాల ధరలతో సామాన్యుల బ్రతుకు ఛిన్నాభిన్నమవుతోంది. దేశంలో మూడు నెలల గరిష్టానికి ద్రవ్యోల్భణం చేరికతో రూపాయి విలువ గరిష్టానికి పతనమైంది. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్భణం 6.52శాతంగా నమోదైందని కేంద్రం చెబుతోంది. అయితే ద్రవ్యోల్భణం 6శాతం మించొద్దని ఆర్‌బీఐ గతంలోనే సీలింగ్‌ విధించింది. అయినప్పటికీ కేంద్ర విధానాలతో పెరుగుతున్న ద్రవ్యోల్భణం దేశ ప్రజలపై భారం మోపుతూనే ఉన్నది. ఇదే అంశాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శాసనసభ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడీ అంశం ఆయన హెచ్చరించినట్లుగానే దేశ, రాష్ట్ర ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. దీని ప్రభావంతో ఈ ఆర్ధిక ఏడాది ప్రజల బడ్జెట్‌కు తూట్లు పొడవనుంది. ఒక్కో కుటుంబం నెలకు రూ. 2వేలనుంచి రూ. 5వేల వరకు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఖజానాపై, పేదల బతుకులపై ఇది పెను విపత్తుగా మారనుంది.

మితిమీరుతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు అవలంభించకపోవడమే కారణమని నిపుణులు అంటున్నారు. ఆర్భీఐ పరిమితికి మించి ఇది నమోదవడంతో ఈ ప్రభావం నిత్యావసరాలపై పడుతోంది. జనవరిలో 6.52శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం డిసెంబర్‌లో 5.72శాతంగా, నవంబర్‌లో 5.88శాతంగా ఉన్నది. ఇదే అంశంపై సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో దేశ ప్రజలపై పడుతున్న మితిమీరిన భారాలను హెచ్చరించారు.

- Advertisement -

ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అపసవ్య ఆర్ధిక విధానాలతో అంతర్జాతీయ విపణిలో దేశీయ రూపాయి విలువ గరిష్టానికి దిగజారుతున్నది. దీంతో ప్రజల బతుకు ఛిద్రమవుతోంది. అన్ని రకాల ధరల్లో పెరుగుదలతో సామాన్యుల రోజూవారీ ఖర్చులు ఇంతింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు సంపద పెరిగి, జీఎస్‌డీపీలో తెలంగాణ వాటా భారీగా వృద్ధి సాధిస్తున్న తరుణంలో రూపాయి విలువ తగ్గుదల ప్రభావం ప్రజలపై నేరుగా పడుతోంది. ఫలితంగా ధరల పెరుగుదల పాపాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో వేస్తోంది. వాస్తవానికి వంటగ్యాస్‌, పెట్రో ఉత్పత్తుల ధరలపై రాష్ట్రాల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. మిగిలిన వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలు విధిస్తుంటాయి. అందుకే రాష్ట్రంలో ఆయా ధరలపై కంట్రోల్‌ ఉంది.

తాజాగా 10ఏళ్ల కనిష్టానికి రూపాయి విలువ పతనమైంది. 2014నుంచి ప్రపంచంలో పలు దేశాల కరెన్సీల విలువలను పరిశీలిస్తే ఇంత దిగజారుడు ఏ దేశంలోనూ జరగలేదు. మే 2014నుంచి 42.17శాతం విలువను రూపాయి కోల్పోయింది. డాలరుతో రూపాయి విలువ దిగజారి రూ. 81మార్కును దాటింది. రూపాయి విలువ పతనంతో ప్రపంచ మార్కెట్‌లో దొరికే వస్తువుల కొనుగోలు మరింత ప్రియం కానున్నాయి. మన దేశానికి క్రూడాయిల్‌, గ్యాస్‌ వంటి నిత్యావసరాలతోపాటు ఇతర వస్తువులు భారీగా దిగుమతి అవుతుంటాయి. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్‌, మిలటరీ ఉపకరణాల ఒప్పందాల వంటివి అమెరికన్‌ కరెన్సీలో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో డాలర్‌ల అవసరం భారత్‌కు ఎప్పుడూ ఉంటుంది. ఈ వస్తువుల డిమాండ్‌ పెరిగేకొద్దీ అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి విలువ అంతకంతకూ పెరుగుతుంది. వాటి దిగుమతులకు భారత దేశం మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరుగుతాయి.

2014నుంచి అదే ఒరవడి…

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడిందనే మాట 2014నుంచి కామన్‌గా వినిపిస్తున్నది. కరోనా మహమ్మారి కారణంగా ఎకానమి మందగించిన అనంతరం రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్ధిక ఆంక్షలను విధించాయి. అనేక దేశాలు రష్యానుంచి క్రూడాయిల్‌ కొనుగోలును నిలిపివేశాయి. యుద్ధం కారణంగా క్‌డాయిల్‌, చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఇది ఆమెరికా, యూరప్‌లపై ప్రభావం చూపింది. దీంతో ఆహారపదార్ధాలు, వంటనూనెలకు ఆటంకాలు ఏర్పడ్డాయి.

ఎందుకిలా…

ద్రవ్యోల్బణం దేశంలో పెరగడంతో విదేశీ పెట్టుబడిదారులు, కంపెనీలు, వ్యక్తులు భారత్‌లోని పెట్టుబడులను వెనక్కి తీసుకొని అమెరికాకు తరలించారు. గత కొన్ని నెలలుగా దేశంనుంచి మిలియన్ల డాలర్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. దీంతో మనీ మార్కెట్‌లో డాలర్ల సరఫరా కొరత ఏర్పడింది. రానున్న రోజుల్లో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌, వడ్డీ రేట్లను మరింత పెంచుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక డాలరుకు ఇప్పుడు చెల్లించే మొత్తంకన్నా ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement