Saturday, May 18, 2024

ఇంగ్లండ్‌తో భారత్​ టెస్ట్​ సిరీస్​.. 2‌–2తో సిరీస్​ డ్రా

బర్మింగ్‌హామ్‌:ఇంగ్లండ్‌పై సిరీస్‌ను గెలుచుకోవాలన్న భారత్‌ ఆశలపై ఆ జట్టు క్రికెటర్లు రూట్‌, బెయిర్‌స్టో నీళ్లు జల్లారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఐదో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్‌ జట్టు చరిత్ర సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలి నాలుగు రోజుల ఆటలో ఆధిపత్యం సాధించిన భారత్‌ చివరి రోజు, మంగళవారంనాటి ఆటలో చేతులెత్తేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌ సిరీస్‌లో దూకుడుగా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్న తీరులోనే ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆడి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. మొత్తంమీద బర్మింగ్‌ హామ్‌ టెస్ట్‌లో విజయం దక్కినట్టే దక్కి చేజారిపోవడంతో భారత జట్టు నిరాశకు లోనైంది. ఇంగ్లండ్‌-భారత్‌ల మధ్య ఐదు టెస్టుల గత ఏడాది మొదలై నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఈలోగా కరోనా విజృంభించడంతో ఐదో టెస్ట్‌ వాయిదా పడింది. ఆ టెస్ట్‌ రీషెడ్యూల్‌ చేయడంతో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్గ్‌బాస్టన్‌లో ఈనెల 1వ తేదీన మొదలైంది. 378 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ చివరిరోజు, మంగళవారంనాడు భారత్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది. ఆ జట్టు ఛేదించిన అత్యధిక పరుగుల లక్ష్యం ఇదే. 2019లో ఆస్ట్రేలియాలో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు కోల్పోయి 362 పరుగులను ఛేదించగా ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిపత్యం
టాస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.భారత్‌ టాప్‌ ఆర్డర్‌ను త్వరగానే ఔట్‌ చేసింది. రోహిత్‌శర్మ స్థానంలో పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సారథ్యం వహించగా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఛతేశ్వర్‌ పుజారా, శుభమన్‌ గిల్‌, హనుమ విహారి, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ త్వరత్వరగా ఔటవడంతో భారత్‌ కష్టాల్లో పడింది. 98/5 స్థితిలో ఉండగా బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను పటిష్ఠ స్థితికి చేర్చారు. రిషభ్‌ పంత్‌ 146 పరుగులు చేయగా జడేజా 175, బుమ్రా 104 పరుగులతో అదరగొట్టడంతో భారత్‌ స్కోరు 416కు స్కోరుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టులోని బెయిర్‌స్టో (106 ) మినహా కీలక ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కేవలం 284 పరుగులకే ఆలౌటయ్యింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ తడబాటు
రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత ఓపెనర్‌ పుజారా ఈసారి 57 పరుగులతో ఊపిలూదాడు. కానీ విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ మరోసారి విఫలమవడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వికెట్లు వెంటవెంటనే పడిపోవడంతో భారత్‌ 245 పరుగులకే చాపచుట్టేసింది. అయినప్పటికీ ఇంగ్లాండ్‌పై 377 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

ఇంగ్లండ్‌ దూకుడు
378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ అనూహ్యంగా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దూకుడుగా ఆడింది. ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌, జాక్‌ క్లాలీ తొలివికెట్‌కు 107 పరుగులతో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. చివరకు క్రాలీని బుమ్రా ఔట్‌ చేశాడు. ఆ తర్వాత లీస్‌ (56) రనౌట్‌ కాగా ఆ సమయంలో విరాట్‌ కోహ్లీతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. మరో క్రికెటర్‌ ఒల్లి పోప్‌ను బుమ్రా ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడినట్లు కన్పించింది. కేవలం 4 ఓవర్ల తేడాతో మూడు వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు మళ్లి పై చేయి సాధింస్తుందని ఆశలుపెట్టుకున్నారు.

ఇంగ్లండ్‌ విజయానికి రూట్‌
ఆ దశలో క్రీజులోకి వచ్చిన జోయ్‌ రూట్‌- బెయిర్‌స్టో కలసి ధాటీగా ఆడుతూ భారత బౌలర్లకు చుక్కలు ఛూపించడం ప్రారంభించారు. 109 పరుగులతో ఆట ప్రారంభించిన ఆ జోడీ భారత బౌలర్లు బుమ్రా, షమీ బౌలింగ్‌ను చావబాదారు. ఆ తరువాత బౌలింగ్‌కు వచ్చిన శార్దూల్‌, సిరాజ్‌ జాగ్రత్తగానే బౌలింగ్‌ చేసినప్పటికీ జడెజా బౌలింగ్‌లో మళ్లిd ఆ జోడీ పరుగులు రాబట్టారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసిన ఇగ్లండ్‌ విజయంపై ధీమాగా ఉంది. ఇక భారత జట్టును గెలిపించాల్సిన బాధ్యత బౌలర్లపై పడింది. ఆ దశలో మంగళవారం ఐదోరోజు మరింత దూకుడుగా ఆడిన జోయ్‌ రూట్‌ తన ఐదవ టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. ఆ తరువాత బెయిర్‌ స్టో కూడా రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ చేయడంతో ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలోకి వెళ్లింది. జూయ్‌ రూట్‌- జాన్‌ బెయిర్‌స్టో మధ్య అవిచ్ఛిన్న 269 పరుగుల భాగస్వామ్యం నెలకొనగా, చివరకు 7 వికెట్ల తేడాతో టెస్ట్‌ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో రూట్‌ 142, బెయిర్‌స్టో 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 1967 తరువాత ఇప్పటివరకు బర్మింగ్‌ హామ్‌లోని ఎడ్గ్‌బాస్టన్‌ టెస్ట్‌లో భారత్‌ విజయం సాధించకపోవడం విశేషం. కాగా తమకన్నా ఇంగ్లండ్‌ క్రీడాకారులు బాగా ఆడారని భారత జట్టు కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా వ్యాఖ్యానించగా ఇంగ్లండ్‌ జట్టు దూకుడును ప్రపంచంలో ఏ జట్టూ అడ్డుకోలేదని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టో అన్నాడు.
కాగా ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత జట్టు క్రీడాకారుల్లో బౌలర్‌ బుమ్రా ప్లేయర్‌ ఆప్‌ ది సిరీస్‌గా నిలిచారు. ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు పడగట్టాడు. ఇక ఇంగ్లండ్‌ జట్టులో బ్యాట్స్‌మన్‌ జోయ్‌ రూట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లోమొత్తం 737 పరుగులు చేసిన రూట్‌ సగటు 105.28గా ఉండటం విశేషం. కాగా చివరి టెస్టులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement