Thursday, May 2, 2024

భారత్-గబాన్ ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం.. గబాన్ పర్యటనలో ఉపరాష్ట్రపతి ఆకాంక్ష

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆఫ్రికాఖండ సర్వతోముఖాభివృద్ధిని భారతదేశం ఆకాంక్షిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆఫ్రికాతో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ప్రయత్నిస్తోందని, ఆఫ్రికాలో వైద్యరంగంతోపాటు డిజిటల్, హరితాభివృద్ధి విషయంలో భారత్ అవసరమైన తోడ్పాటునందిస్తోందని అన్నారు.
గబాన్‌లో ఉన్న భారతీయ సంతతి ప్రజలు, వ్యాపావేత్తలతో ఉపరాష్ట్రపతి నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆఫ్రికా పురోగతిలో భారతదేశం తన పాత్రను సుస్పష్టంగా పోషిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆఫ్రికా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలోనూ గబాన్-భారత్ మధ్య బిలియన్ డాలర్ వాణిజ్యం జరిగిందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గబాన్ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే విషయంలో భారతదేశం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. వ్యవసాయరంగంలోనూ అవసరమైన మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు. గబాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (జీఎస్ఈజెడ్) ను భారతీయ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జీఎస్ఈజెడ్ లో 54 భారతీయ కంపెనీలు తమ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని అధికారులు ఉపరాష్ట్రపతికి తెలిపారు. పర్యటన సందర్భంగా ఎస్ఈజెడ్‌లోని కార్మికులు వివిధ కంపెనీ ప్రతినిధులతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు.
గబాన్ లో భారతీయ సంతతి ప్రజల కారణంగా ఇక్కడ మన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగుతుండటాన్ని ఆయన అభినందించారు.

భారతదేశాన్ని మళ్లీ విశ్వగురుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో విదేశాల్లోని భారతీయ సంతతి ప్రజల పాత్ర కీలకమని వెంకయ్య నాయుడు అన్నారు. భారతీయ సంతతి ప్రజలు, వ్యాపారవేత్తలతో సమావేశం, జీఎస్ఈజెడ్ సందర్శనలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ఎంపీలు సుశీల్ కుమార్ మోదీ, విసయ్ పాల్ సింగ్ తోమర్, పి.రవీంద్రనాథ్, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement