Tuesday, November 5, 2024

1st ODI: నేడు భారత్‌-ఆస్ట్రేలియా తొలి వన్డే

మరో రెండు వారాల్లో భారత్‌ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ సమరం మొదలవనుంది. దానికంటే ముందు భారత్‌, ఆస్ట్రేలియా కీలమైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడబోతున్నారు. దానిలో భాగంగా నేడు (శుక్రవారం) మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా, ఆసీస్‌కు ఈ టోర్నీ సన్నాహాకంగా మారింది. ఈ సిరీస్‌ను రెండు జట్లు ప్రపంచకప్‌కు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోనున్నారు. ఇప్పటికే భారత్‌, ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా సీనియర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లకు తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక టీమిండియా పగ్గాలను కేఎల్‌ రాహుల్‌కు అప్పగించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆసియాకప్‌ గెలిచి జోష్‌ మీదున్న టీమిండియా ఇప్పుడు తమ ఫోకస్‌ అంతా అగ్రస్థానంపైనే పెట్టింది. ప్రస్తుతం టాప్‌-2గా ఉన్న భారత్‌.. ఈ సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రపంచకప్‌లో నెంబర్‌.1 జట్టుగా బరిలోకి దిగాలని దృడసంకల్పంతో ఉంది. మరోవైపు కొన్ని రోజుల క్రితమే నెం.1 స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయిన ఆసీస్‌ కూడా ఈ టోర్నీలో మరోసారి సత్తా చాటుకోవాలని ఆతృతగా ఉంది.


ప్రపంచకప్‌ పోటీదారులుగా ఆ ఇద్దరూ..
మరో 13 రోజుల్లో ప్రపంచకప్‌ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేశాలు తమతమ జట్లను ప్రకటించాయి. భారత్‌ కూడా తమ జట్టును ప్రకటించింది. కానీ శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌ గాయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు వీరి స్థానాలను సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, హైదరాబాద్‌ యువ సంచలనం తిలక్‌వర్మలతో పూర్తి చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తుందని తెలుస్తోంది. అందుకే ఆసియాకప్‌లో చోటు దక్కించుకోని ఆశ్విన్‌ ను ఆసీస్‌ సిరీస్‌కు ఎంపిక చేసింది. మరోవైపు ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్‌లో సీనియర్‌ ఆటగాడైన అశ్విన్‌కి చోటు ఇవ్వాలని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచకప్‌కు ముందు ఇదే చివరి సిరీస్‌ కావడంతో అశ్విన్‌ను పరీక్షించుకునేందుకు సెలక్టర్లకు ఇదే చివరి అవకాశంగా మారింది.

ఈ సిరీస్‌లో అశ్విన్‌ సత్తాచాటుకోవాల్సి ఉంది. మరోవైపు అప్పటివరకు అక్షర్‌ కోలుకోకపోతే వరల్డ్‌కప్‌లో ఈ సీనియర్‌ ఆటగాడి ఎంట్రీ దాదాపు ఖాయమనే చెప్పాలి. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో అతని బదులుగా హైదరాబాదీ యువ స్టార్‌ తిలక్‌ వర్మవైపు భారత మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించిందని తెలుస్తోంది. విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత వన్డేల్లో ఇతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇక ఈసారి సీనియర్ల గైర్హాజరీలో తిలక్‌కు అవకాశం లభిస్తే తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక మరో యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఈ రేసులో నిలిచాడు. ఇతని ఆటపై కూడా భారత సెలక్టర్లు దృష్టి పెట్టారు. ఇక టీమ్‌ విషయానికి వస్తే కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మాన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌లతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ బుమ్రా, సిరాజ్‌, షమీలతో పేస్‌ దళం.. అశ్విన్‌, జడేజా, సుందర్‌లో స్పిన్‌ విభాగం దూకుడుగా కనిపిస్తోంది.

- Advertisement -

ఆసీస్‌కు ఎదురుదెబ్బ..
తొలి వన్డే ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్‌ ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ గాయాలతో మొదటి మ్యాచ్‌కి దూరమయ్యారు. భారత్‌ గడ్డపై ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం మ్యాక్స్‌వెల్‌కి ఉంది. ఇప్పుడు అతను తొలివన్డేకు దూరమవడం ఆసీస్‌కు పెద్ద షాకే. దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌లు తొలి వన్డేలో ఆడనున్నారు. ప్రపంచకప్‌ జట్టుతోనే ఆసీస్‌ భారత్‌తో తలపడనుంది. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న డేవిడ్‌ వార్నర్‌ భారత్‌కు పెద్ద సవాల్‌గా మారనున్నాడు. భారత్‌ పిచ్‌లపై ఇతనికి మంచి అనుభవం ఉంది. ప్రస్తుత ఆసీస్‌ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో పటిష్టంగా ఉంది. టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

భారత జట్టు (అంచనా): కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మాన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవీచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, శార్దుల్‌ ఠాకుర్‌, మహ్మద్‌ షమీ.


ఆస్ట్రేలియా జట్టు (అంచనా): పాక్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, అలెక్స్‌ క్యారీ, నాథన్‌ ఎల్లిస్‌, కెమెరూన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లీస్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, మర్నూస్‌ లబూషేన్‌, మిచెల్‌ మార్ష్‌, తన్వీర్‌ సంఘా, మాట్‌ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్కస్‌ స్టోయినీస్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా.

Advertisement

తాజా వార్తలు

Advertisement