Friday, May 17, 2024

Delhi | ‘ఇండియా’ కూటమి ఒక మిథ్య.. అభివృద్ధిని అడ్డుకోవడమే వారి ఎజెండా : కే.లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఐ.ఎన్.డీ.ఐ.ఏ (ఇండియా) పేరుతో ఏర్పడ్డ విపక్ష కూటమి ఒక మిథ్య అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. అభివృద్ధి విరోధులు, కుటుంబ, అవినీతి పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయని సూత్రీకరించారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాలకు నాయకత్వం, జెండా, ఎజెండా ఏదీ లేదని అన్నారు. అందుకే పార్లమెంటులో చర్చలు జరగకుండా అడ్డుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. విపక్షాలకు ఎన్నికల జ్వరం పట్టుకుందని విమర్శించారు. ప్రత్యేక సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం, పార్టీ సిద్ధంగా ఉన్నాయని, ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల గురించి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం, పెండింగ్ బిజినెస్ కోసమే ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపరిచినట్టు తాను భావిస్తున్నానన్నారు. ఎజెండాపై తమకు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అయితే ఉమ్మడి పౌరస్మృతి కావాలని దేశంలో 99 శాతం ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. మరోవైపు జమిలి ఎన్నికల ద్వారా చాలా పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చని అన్నారు. ఆ డబ్బుతో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి ఆస్కారం ఉంటుందని సూత్రీకరించారు.

అందుకే ప్రధాన మంత్రి జమిలి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారని, దానిపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోందని చెప్పారు. సమాజంలో అనేక వర్గాలు జమిలి ఎన్నికలపై ప్రధాని ఆలోచనకు మద్దతు తెలిపాయని డా. లక్ష్మణ్ అన్నారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశ ప్రజల హితం కోసమే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

- Advertisement -

ఎన్నికలను ముందుకు జరిపే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి ఆలోచనేది లేది, అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ మాత్రం సిద్ధంగా ఉందని లక్ష్మణ్ తెలిపారు. గ్యాస్ ధరల తగ్గింపు రాజకీయం చేయడం తగదని, తగ్గించకపోతే ఒకలా.. తగ్గించాక మరోలా మాట్లాడ్డం ప్రతిపక్షాలకే చెల్లిందని విమర్శించారు. ప్రధాన మంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారని, కోవిడ్-19 కష్టకాలంలో ప్రారంభించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇప్పటికీ రేషన్ ఉచితంగా అందజేస్తున్నారని గుర్తుచేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 17న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు డా. లక్ష్మణ్ వెల్లడించారు. అదే రోజు విశ్వకర్మ జయంతి కూడా కావడంతో చేతివృత్తులపై జీవించే 140 కులాల వారికి రూ. 13 వేల కోట్ల బడ్జెట్‌తో 3 లక్షల రుణాలు అందించే పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 17న తెలంగాణ లో సెప్టెంబర్ 16న ఓబీసీ మోర్చా నేతృత్వంలో జిల్లా, మండల స్థాయిల్లో బైక్ ర్యాలీలు కూడా నిర్వహిస్తామని అన్నారు. చేతివృత్తుల్లో ట్రైనింగ్ ఇవ్వడం, ఆర్థిక సహాయం అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాడమే లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అమలుచేయనున్నట్టు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement