Sunday, April 28, 2024

బీఈడీపై అమ్మాయిల్లో పెరుగుతున్న క్రేజ్‌.. కోర్సు ఎంపికలో వారే అధికం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఉన్నత విద్య పట్ల అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ కోర్సుల్లో అమ్మాయిల ఎన్‌రోల్‌మెంట్‌, ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతోంది. అయితే అబ్బాయిల ఎన్‌రోల్‌మెంట్‌ మాత్రం తగ్గుతోంది. బీఈడీ, పలు పీజీ కోర్సుల ఎంపికలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పైచదువులు చదివేందుకు వారు ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు పైచదువులంటేనే అమ్మాయిలకు దూరంగా ఉండేవి. కట్టుబాట్లు, చిన్న వయస్సులోనే పెళ్లి, ఇతర వేరే కారణాలు కావొచ్చు…అమ్మాయిలకు చదువు, రాత అంతగా ఉండేది కాదు.

కానీ గత రెండు మూడేళ్లుగా చూసుకుంటే కాలం మారుతున్న కొద్దీ ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఏరంగాల్లో చూసినా అమ్మాయిలు ముందు వరుసలో ఉంటున్నారు. తల్లిదండ్రుల్లోనూ చాలా మార్పు వచ్చింది. చదువుల్లో అబ్బాయిలకు అమ్మాయిలు గట్టి పోటీనిస్తున్నారు. ఈ ఏడాది టెన్త్‌, ఇంటర్‌, ఎంసెట్‌ ఫలితాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు.

సోమవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసిన టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలిలాల్లోనూ ఇదే స్పష్టమైంది. ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఆయా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు. అయితే సోమవారం ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌. లింబాద్రి విడుదల చేశారు. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి మొత్తం 98.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 31,725 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో పరీక్షకు హాజరైంది 27,495 మంది, ఉత్తీర్ణత సాధించింది మాత్రం 26,994 మంది.

- Advertisement -

అయితే జెండర్‌వైస్‌గా చూసుకుంటే ఎడ్‌సెట్‌కు 25,716 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకుంటే, అబ్బాయిలు కేవలం 6009 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరైన వారిలోనూ 22,400 మంది అమ్మాయిలు ఉంటే, అబ్బాయిలు కేవలం 5095 మంది మాత్రమే ఉండడం గమనార్హం. ఇక ఉత్తీర్ణత సాధించిన వారిలోనూ 21,935 మంది అమ్మాయిలు కాగా, అబ్బాయిలు మాత్రం 5059 మంది ఉన్నారు. ఈ ఏడాది బీఈడీ కోర్సు ఎంపికలో దాదాపు 80 శాతం పైగా అమ్మాయిలే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పీజీ లైఫ్‌సైన్స్‌ లాంటి కోర్సుల్లోనూ అమ్మాయిలే ఎక్కువ మంది ప్రవేశాలు పొందుతున్నారు. ఒకప్పుడు బీఈడీ చేసిన అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు వెతుక్కొని వచ్చేవి.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఈడీ చేసినవారు లక్షల్లో ఉండడం, డీఎస్సీ లేదా టీఆర్‌టీ ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్లు సరిగా వెలువడకపోవడంతో బీఈడీ చేసేందుకు అబ్బాయిలు ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. అయితే అమ్మాయిలు మాత్రం ఈ కోర్సు చేసేందుకు సుముఖత చూపిస్తున్నారు. బీఈడీ చేసి ఏదైనా ప్రవేట్‌ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయురాలిగా, ఇంకేదైనా చేసుకోవచ్చనే ఉద్ధేశంతో బీఈడీ కోర్సును ఎంచుకుంటున్నారు.

టాప్‌ 5 ర్యాంకర్లు వీరే…

టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాల్లో మొదటి ర్యాంకును వికారాబాద్‌ తాండూర్‌కు చెందిన గొల్ల వినీష కైవసం చేసుకున్నారు. రెండో ర్యాంకును నిషా కుమారి (బేగంపేట్‌), మూడో ర్యాంకును ఎం.సుశీ (హైదరాబాద్‌), నాల్గో ర్యాంకును వాసాల చంద్రశేఖర్‌ (మెట్‌పల్లి, జగిత్యాల), ఐదో ర్యాంకును అకోజు తరుణ్‌ చంద్‌ (శ్రీరాంపూర్‌, పెద్ద పల్లి) సాధించారు.

ప్రతి ఏటా మిగులుతున్న సీట్లు…

ప్రతి ఏటా బీఈడీ సీట్లు మిగులుతున్నాయి. గతేడాది 2022లో రాష్ట్రంలోని 211 కాలేజీల్లో కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా కలిపి మొత్తం 18,350 సీట్లకు గానూ 13,756 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 4,594 సీట్లు మిగిలాయి. ఈఏడాది కూడా 18,350 సీట్లు అందుబాటులో ఉన్నాయని మండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు అడ్మిషన్లను దోస్త్‌ ద్వారానే భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే ప్రైవేట్‌ బీఈడీ కాలేజీలకు అనుమతులిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొ.ఏ.రామకృష్ణ, కో కన్వీనర్‌ ప్రొ.శంకర్‌, మహాత్మాగాంధీ వీసీ ప్రొ.గోపాల్‌రెడ్డి, ఇతర అధికారులు కృష్ణారావు, మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement