Thursday, April 25, 2024

పెరుగుతున్న ఫ్లూ కేసులు.. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులతో తీవ్ర ప్రభావం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు జలుబు, దగ్గు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలు వారాల తరబడి కొనసాగుతుండటంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు సైతం పెరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో చికిత్స కోసం ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో కేవలం ఫ్లూ లక్షణాలతో చికిత్స కోసం వస్తున్న ఓపీ సంఖ్య రోజకు 800 నుంచి 1000 వరకూ ఉంటోంది. సాధారణంగా శీతాకాలంలో కోవిడ్‌ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వేసవి కాలంలోనూ కోవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో ఫ్లూ, కొరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర్ర వైద్య,ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధితులు వందల సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్న దృష్ట్యా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫ్లూ లక్షణాలకు సంబంధించిన మందులను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచింది. హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మొహంతి, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డిహెచ్‌ శ్రీనివాస్‌, టివివిపి కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌, నీలోఫర్‌ సూపరింటెండెంట్‌ ఉషారాణి, ఎంజిఎం సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ సహా టీచింగ్‌ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిన నేపథ్యంలో రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందనీ, దీనిని ఎదుర్కునేందుకు అన్ని ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని సూచించింది. కాగా, ఫ్లూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా తుమ్ములు, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారు మళ్లి మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. తుమ్మినప్పుడు, లేదా దగ్గినప్పుడు క్లాత్‌ అడ్డంగా పెట్టుకోవాలనీ, చిన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.

ఫ్లూ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం : డా.అజయ్‌ కుమార్‌

ప్రజలు ఫ్లూ జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంపొందిచుకోవాలని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డా.అజయ్‌ కుమార్‌ సూచించారు. ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలలో ఎక్కువగా తిరిగకపోవడం, అపరిచిత వ్యక్తులతో చేతులు కలపకపోవడం వంటి ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫ్లూ సంబంధిత వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామనీ, పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తూ దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement