Monday, April 29, 2024

Delhi | జేజేఎం స్కీం అమలు ఆంధ్రలో సరిగా లేదు.. జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జల్‌జీవన్ మిషన్ పథకం అమలు ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా లేదని కేంద్రప్రభుత్వం తెలిపింది. పథకం కోసం ఇచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వాడుకోలేదని చెప్పుకొచ్చింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో తాగునీరు అందుతున్న ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సహా ఉత్తర కోస్తా జిల్లాల్లో కుళాయి కనెక్షన్లు ఇచ్చిన ఇళ్ల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందని ఆయన అడిగారు.

ఉత్తరాంధ్రలో తాగునీరు అందించే ప్రాంతాల పరిధిని మెరుగుపరిచేందుకు చేపట్టవలసిన స్పెషల్ డ్రైవ్‌ గురించీ అందులో ప్రస్తావించారు. ఎంపీ జీవీఎల్ ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ సోమవారం బదులిచ్చారు. జల్‌జీవన్ పథకం అమలు సరిగా లేదని రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలో విఫలమైందని, 2021 నుంచి జల్‌జీవన్ మిషన్ కింద కేటాయించిన డబ్బును ఇప్పటివరకు ఉపయోగించుకోలేదని వెల్లడించారు. ఆంధ్ర ప్రజలకు కేంద్ర పథకం ఫలాలు అందడం లేదని, ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement