Friday, April 26, 2024

Follow Up | హైదరాబాద్‌, వరంగల్‌ కేంద్రాలుగా… లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు ఆగడం లేదు. ఆర్‌ఎంపీ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో రహాస్యంగా ఒప్పందం చేసుకుని చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. 1994 లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలులో ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని బేఖాతరు చేస్తూ గర్భస్థ శిశువులను పిండ దశలోనే చిదిమేస్తున్నారు. తాజాగా, వరంగల్‌ జిల్లా పోలీసుల దాడుల్లో బయటపడ్డ లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్‌లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలలోని మారుమూల ప్రాంతాల్లో ఆర్‌ఎంపి వైద్యులు స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుని ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు.

ఆర్‌ఎంపి వైద్యులు గ్రామాలలో తిరిగి అప్పటికే ఆడపిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రులను గుర్తించి తరువాతి కాన్పులో మళ్లి ఆడపిల్ల పుడితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని భయపెట్టి గర్భస్రావాలు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చడీ చప్పుడు కూడా గర్భిణులకు అబార్షన్లు చేయిస్తూ రూ.30 నుంచి 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు, స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకుల నుంచి కూడా పర్సంటేజీల రూపంలో కమిషన్లు దండుకుంటున్నారు. అబార్షన్‌ కోసం వచ్చిన మహిళలు పెళ్లికాని వారైతే రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు ఆర్‌ఎంపీలు, ఏజెంట్లు జిల్లాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే అనుమానం వస్తుందన్న భయంతో గర్భిణులను రహాస్యంగా రాష్ట్ర్ర రాజధాని హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు సైతం పంపిస్తున్నట్లు సమాచారం.

లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో అవసరం లేనప్పటికీ ఆపరేషన్లు చేయిస్తూ మహిళల ప్రాణాల పైకి తెస్తున్నారు. కాగా, 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన లింగ నిర్ధారణ పరీక్షల చట్టం అమలుకు నోచుకోవడం లేదు. ఈ చట్టం అమలు చేయాల్సిన బాధ్యత ఆయా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులపైనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రైవేటు ఆసుపత్రులలో స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేస్తూ లింగ నిర్ధారణ పరీక్షలను నియంత్రించాల్సి ఉంటుంది. అలాగే, స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులకు అనుమతి ఇచ్చే ముందు కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన పరీక్షలు చేసిన పక్షంలో వాటి అనుమతులు రద్దు చేస్తామని ముందుగానే నిబంధన విధించాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్ర్రంలోని కొన్ని జిల్లాలలో ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం వెలుగు చూస్తున్నప్పటికీ షరా మామూలుగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా వరంగల్‌ జిల్లాలో వెలుగు చూసిన లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్‌ విషయంలోనూ అక్కడి జిల్లా వైద్యాధికారుల దృష్టికి విషయం వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయా ఆసుపత్రులపై నిఘా పెట్టిన పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్న వ్యక్తులు, అందుకు సహకరిస్తున్న వైద్యులను కూడా అరెస్టు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టే బాధ్యత వైద్య, ఆరోగ్య శాఖ అధికారులదేననీ, ఈ విషయంపై వారితో సమావేశం నిర్వహిస్తామని చెప్పడం కొసమెరుపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement