Tuesday, October 8, 2024

TS | డీహెచ్​గా ఐదేళ్లు పూర్తి.. గడల శ్రీనివాసరావుకు ఘన సన్మానం

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌గా ఐదేండ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న డాక్టర్ గడల శ్రీనివాసరావును టీఎన్‌జీవో నాయకులు, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఇవ్వాల (సోమవారం) రాత్రి ఘనంగా సత్కరించారు. డైరెక్టర్‌‌గా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కోఠిలోని డైరెక్టరేట్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి డైరెక్టర్‌‌గా తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌‌కు, ఈ ఐదేండ్ల సర్వీస్‌లో తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

కరోనాను ఎదుర్కోవడమైనా, దవాఖాన్లలో సౌలతులను మెరుగుపర్చడమైనా తన ఒక్కడితోనే సాధ్యం కాలేదన్నారు గడల శ్రీనివాస్​రావు. హెడ్ ఆఫీస్‌ నుంచి సబ్ సెంటర్‌‌ వరకూ అందరూ సహకరించడం వల్లే అన్ని విజయాలు సాధించగలిగామన్నారు. ప్రభుత్వ అధికారులైనా, సిబ్బంది అయినా మనస్పూర్తిగా, ప్రజల పట్ల సానుభూతితో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది ఈ లక్షణాలను ఇంకా ఎక్కువగా కలిగి ఉండాలన్నారు. వర్క్‌లైఫ్‌తో పాటు, ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బ్యాలన్స్ చేసుకోవాలన్నారు. అనవసరంగా పరిగిత్తి మానసిక సమస్యలు తెచ్చుకోవద్దన్నారు. పడుకుంటే ఆలోచన లేకుండా నిద్రపట్టేలా ఉండాలన్నారు.

ప్రశాంతంగా, ప్రణాళిక బద్ధంగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధింగలమన్నారు. ఈ పదేండ్లలో ఆరోగ్యశాఖలో అనేక మార్పులు వచ్చాయని, ప్రజారోగ్య వ్యవస్థ చాలా అభివృద్ధి చెందిందని డీహెచ్ అన్నారు. మారుమూల ప్రాంతంలోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌‌, మంత్రి హరీశ్‌రావుకు దక్కుతుందన్నారు. తనకు ఇంకా ఏడేండ్ల సర్వీస్ ఉందని, ఈ ఏడేండ్లు కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పని చేయాలని ఆశిస్తున్నానన్నారు. తాను డైరెక్టర్‌‌గా ఉన్న కాలంలో రెండేళ్లు అతిముఖ్యమైనవని డీహెచ్ అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి ప్రజలను పీడించడం, అదే సమయంలో తన తండ్రి చనిపోవడం తనను తీవ్రంగా బాధించాయన్నారు. అయితే, అదే సమయంలో ప్రజలకు సేవ చసే అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్‌‌కు తాను రుణపడి ఉంటానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement