Monday, April 29, 2024

Delhi: భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తారు?.. ఫాంహౌజ్ నిందితుల పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసులో నిందితులు రామచంద్ర భారతి అలియాస్ వీకే సతీశ్ శర్మ, నందు కుమార్, సింహయాజిలు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నిందితుల తరఫున న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ.. అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసులో అందుకు తగిన ఆధారాల్లేవంటూ ఏసీబీ కోర్టు రిమాండ్ తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.

అయితే రెండ్రోజుల వ్యవధిలో హైకోర్టు పూర్తి భిన్నమైన తీర్పునిచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం ఇలా ఎలా తీర్పులిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితుల విడుదల కోసం బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉంటే ఈరోజే విడుదల చేసేవాళ్లమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసుల తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. అయితే కేసులో మెరిట్ ఆధారంగా తదుపరి విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ ఈనెల 7కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement