Thursday, May 2, 2024

ప‌ఠాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలా అనుమ‌తిచ్చింది.. న‌టుడు ముఖేష్ ఖ‌న్నా

పఠాన్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాల‌ని సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు షారుక్ ఖాన్‌, దీపికా పదుకొణె జంటగా నటించారు.యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. జాన్‌ అబ్రహం కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం నుంచి ‘బేషరమ్‌ రంగ్‌..’ సాంగ్‌ విడుదలైనప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది. ఈ పాటలో దీపికా పదుకొణె వేసుకున్న దుస్తులు, పాటను చిత్రీకరించిన విధానం అసభ్యకరంగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. పలువురు ఇప్పటికే ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని ఆందోళనకు సైతం దిగారు. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా స్పందించారు. బేషరమ్‌ రంగ్‌.. పాట చూడటానికి చాలా అసభ్యకరంగా ఉందన్నారు. మన సినీ ఇండస్ట్రీ అస్తవ్యస్థంగా మారింది.

ముఖ్యంగా అశ్లీలత ఎక్కువైంది. నటీనటుల్ని ఇప్పుడు పొట్టి పొట్టి దుస్తుల్లో చూపించిన ఫిల్మ్‌మేకర్స్‌.. రాబోయే రోజుల్లో బట్టలు లేకుండా చూపిస్తారేమో.. . ఇతరుల ఫీలింగ్స్‌ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతించింది.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలను ఇబ్బంది కలగకుండా సినిమాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సెన్సార్‌ బోర్డుదని ఆయన అన్నారు. యువతను ప్రేరేపించే, తప్పుదోవ పట్టించే చిత్రాలను సెన్సార్‌ బోర్డు అనుమతివ్వకూడదని చెప్పారు. ఇదేమీ ఓటీటీ కోసం చేసిన పాట కాదని, సినిమా కోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసభ్యకరంగా ఉన్నప్పటికీ సెన్సార్‌ ఎలా ఆమోదించింది. అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement