Saturday, May 4, 2024

ఆటో డ్రైవర్‌‌‌ను ఆశ్చర్యపరిచిన హీరోయిన్ సమంత

నటి సమంత దాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియా వేదికగా ఎన్నో సహాయక కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. తాజాగా సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ కవితకు ప్రముఖ నటి సమంత ఊహించని బహుమతిని అందజేసింది. గురువారం నాడు బంజారాహిల్స్‌లోని మారుతి షోరూం నిర్వాహకులు ఆటో డ్రైవర్‌ కవితకు ఫోన్ చేసి షోరూంకు రావాలని చెప్పారు. దీంతో ఆమె షోరూంకు వెళ్లగా నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్‌ డిజైర్‌ కారును కవితకు అందజేశారు. ఇది నటి సమంత అందజేసిన బహుమతి అని చెప్పడంతో కవిత ఆనందంతో ఉప్పొంగిపోయింది.

ఓ పేద కుటుంబంలో పుట్టిన కవిత ఎన్నో కష్టాలను అనుభవించి ఆటోడ్రైవింగ్ నేర్చుకుని హైదరాబాద్‌లో బతుకుదెరువు పొందుతోంది. యూట్యూబ్‌లో ఆమె జీవిత చరిత్ర తెలుసుకున్న నటి సమంత చలించిపోయి ఉపాధి కోసం కారును బహుమతిగా అందజేసింది. కాగా సమంత తనకు ఇలా సర్‌ప్రైజ్ ఇవ్వడం జీవితంలో మరిచిపోలేనని కవిత సంబరపడిపోతోంది. సమంత చేసిన ఈ మంచి పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement