Monday, May 6, 2024

Survey | వేధిస్తున్న ఉద్యోగ భద్రత.. ప్రతి 10 మందిలో 5గురి పరిస్థితి ఇదే

దేశంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 47 శాతం మంది తమ ఉద్యోగాలకు భద్రత లేదని భావిస్తున్నారు. సర్వే చేసిన 17 దేశాలలో సగటును మన దేశం అధిగమించింది. ప్రతి పది మంది కార్మికుల్లో నలుగురు (38 శాతం) ఉద్యోగ భద్రత గురించి ఒకే విధమైన భావాలను పంచుకున్నారు. ఏడీపీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2023, ఏ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ వీవ్‌ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని యజమానులు తమ ఉద్యోగుల పట్ల నిబద్దతను చాటుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.

సర్వే చేసిన వారిలో ఎక్కువగా యువతలోనే ఉద్యోగ భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. మొత్తం 32 వేల మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 18-24 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో 50 శాతం మంది తమ ఉద్యోగ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న వారిలో 24 శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టెక్నాలజీ రంగంతో పాటు అనేక ప్రొఫెషనల్‌ సర్వీసుల్లో భారీగా ఉద్యోగులను తొలగింపులు జరిగాయి. కరోనా మూలంగా దెబ్బతిన్న ఆతిధ్య రంగంలో కూడా ఉద్యోగుల కోత భారీగానే ఉంది. మరో వైపు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ)తో కూడా ఉద్యోగాలకు ముంపు ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఆర్ధిక వ్యవస్థల అనిశ్చితి మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దిగ్గజ కంపెనీలు కూడా వ్యయ నియంత్రణ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని నివేదిక పేర్కొంది. అయితే ఇప్పటికీ చాలా రంగాల్లో సరై న నైపుణ్యం ఉన్న వారు లభించక సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. అందువల్ల కొంత మంది నమ్ముతున్నంత భయంకరమైన పరిస్థితి ఉండకపోవచ్చని, ప్రస్తుతం నెలకొన్ని పోటీ పరిస్థితుల మూలంగా యజమానులకు తమ ఉద్యోగులు విలువైన వారని గుర్తించవచ్చని ఏడీపీ ఎండీ రాహుల్‌ గోయల్‌ అభిప్రాయపడ్డారు. ఇలా గుర్తించడం వల్ల ఆయా సంస్థల్లో పని చేస్తున్నవారి భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందని భరోసా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ప్రస్తుత ఆర్ధిక అనిశ్చితి మూలంగా ఏ రంగం పెద్దగా ప్రభావితం కాదని 10 మందిలో 6 గురు కార్మికులు నమ్ముతున్నారు. 25 శాతం మంది రానున్న ఐదు సంవత్సరాల్లో పరిశ్రమలో ఏఐ వినియోగం సర్వసాధారణమైపోతుందని, మాన్యూవల్‌ పనులు తగ్గించడానికి ఇది దారితీస్తుందని భావిస్తున్నారు. ఇండియాలో రిలయల్‌ ఎస్టేట్‌ రంగంలో 56 శాతం మంది, నిర్మాణ రంగంలో 55 శాతం మంది ఉద్యోగుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రంగాల కంటే వీటిలో ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉంది. మీడియా, ఇన్ఫోర్మేషన్‌ ఇండస్ట్రీలో పని చేస్తున్న వారిలో 54 శాతం మంది ఉద్యోగ భద్రతపై ఆందోళనగా ఉన్నారు. ఆతిథ్య రంగంలో పని చేస్తున్నవారిలో 51 శాతం మంది ఉద్యోగ భద్రత లేదని అభిప్రాయపడ్డారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తే ఎక్కువ పనిగంటలు పని చేసేందుకు సిద్ధమని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుందని నివేదిక పేర్కొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement