Monday, April 29, 2024

Haryana: గుండెపోటుతో హనుమంతుని పాత్రధారి మృతి

అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ జ‌రుపుకుంటున్న వేళ‌ హ‌రియానా రాష్ట్రంలో విషాదం నెలకొంది. హనుమంతుడిగా వేషధారణ చేసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హరియాణాలోని భివానీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న క్రమంలో హరియాణాలోని భివానీలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా హరీష్ అనే వ్యక్తి హనుమంతుని పాత్ర పోషించాడు.

అయితే ఈ ప్రదర్శనలో తన పాత్రను పోషిస్తుండగా ‘జై శ్రీరామ్’ అంటూ ఒక్కసారిగా గుండెపోటుతో కిందపడిపోయాడు. అయితే అందరూ అతను నాటకంలో భాగంగా అలా చేస్తున్నాడేమో అనుకున్నారు. కొద్ది సేపటికి ఆయన గుండెపోటుకు గురైనట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ హనుమంతుడి పాత్రధారిగా హరీష్ అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement