Thursday, May 2, 2024

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి నిరంజన్‌రెడ్డి

తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు – రిజిస్టర్ కులసంఘాల నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం భవనాలకు అనుమతి పత్రాలను మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్‌, బసవరాజు సారయ్య, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అదనపు సంచాలకులు మల్లయ్య భట్టు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ తెలంగాణ ప్రబలమైన మార్పులు వస్తున్నాయన్నారు. మార్పును చూడలేనివారు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుబంధు అర్హులు 65లక్షల మంది ఉన్నారని, ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 8.54లక్షల మంది, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రైతులు 8.24లక్షలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు 37.5లక్షల మంది ఉన్నారని తెలిపారు. రైతుబంధు విషయంలో కొందరు అర్థం లేదని వాదన చేస్తున్నారని, రాష్ట్రంలో 1.50కోట్ల సాగు యోగ్యమైన భూమి ఉన్నదన్నారు. ఇందులో 92.5శాతం భూమి ఐదెకరాల్లోపు రైతు చేతుల్లో ఉందని, సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌ పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది సన్న, చిన్నకారు రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలేనన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధితో తెలంగాణలో ఒక్కో సామాజికవర్గం క్రమంగా బలపడుతున్నదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement