Monday, May 20, 2024

STPలకు ఫండ్స్ ఇవ్వండి… కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగరంలో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం ఆర్థిక సహాయం అందించాలని మంత్రి కే.టీ. రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్‌కు ఆర్థిక సహాయం అందించాలన్న అభ్యర్థనతో పాటు నగరంలో పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (పీఆర్టీఎస్) కారిడార్‌కు సహకరించాలని కోరారు. ఈ రెండు అంశాలపై కేంద్ర మంత్రికి లేఖలు అందజేశారు. సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 62 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు లేఖలో వెల్లడించారు. మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8,684.54 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేసినట్టు మంత్రి కేటిఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు అమృత్-2 పథకం కింద రూ.2,850 కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని లేఖలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 100% మురుగునీటిని శుద్ధి చేయడమే కాకుండా మూసీ నది, ఇతర నీటి వనరులకు మురుగు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ మహానగరంగా మారుతోందని కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రయాణికుల డిమాండ్‌ తీర్చడానికి 69కిమీ మెట్రో రైలు నెట్‌వర్క్, 46 కిమీ సబ్-అర్బన్ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) హైదరాబాద్ లో ఉందని వివరించారు. మెట్రో రైల్, ఎంఎంటీఎస్ లకు ఫీడర్ సేవలు అందించేలా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్, రోప్‌వే సిస్టమ్స్ వంటి స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం తెలంగాణ అన్వేషిస్తోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు 10 కి.మీ పొడవున PRTS కారిడార్‌ను ప్రతిపాదించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపాదిత కారిడార్ వివిధ రవాణా వ్యవస్థలతో అనుసంధానించి ఉంటుందని పేర్కొన్నారు. ఇండియన్ పోర్ట్ రైల్ & రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్ (IPRRCL) ఈ కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్లుగా ఉన్నారని చెప్పారు. దేశంలో పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ కోసం ప్రమాణాలు, స్పెసిఫికేషన్‌లను సిఫార్సు చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ హై పవర్ కమిటీని నియమించిందని గుర్తుచేస్తూ.. ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ప్రమాణాలు, నిర్దేశాలు, ఇతర అంశాలను త్వరగా అందించడానికి శాఖపరంగా సమన్వయం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement