Wednesday, May 15, 2024

ప్లిప్ కార్ట్ లో గిరి బ్రాండ్ తేనె….

హైదరాబాద్‌, : అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలు సేకరిస్తున్న తేనెకు బలే డిమాండ్‌ వస్తోంది. ఆదిమ గిరిజనులు సాంప్రదాయకంగా అటవీ ఉత్పత్తులపై ఆధారపడే జీవనో పాధి కొనసాగుతుంది. అటవీ ఉత్పత్తులను సేకరిస్తున్న గిరిజ నుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ తేనె శుద్ధికర్మాగారం ఏర్పా టు చేసింది. శుద్ధిచేసిన తేనెను ప్రపంచ దేశాలకు అందిం చేందుకు జీసీసీ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మార్కె టింగ్‌ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ‘గిరి బ్రాండ్‌’ పేరుతో మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌ , భద్రాచలం, నల్లమల్ల అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులు తేనెను సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే తేనెలో మెరుగైన ఔషధ గుణాలు ఉండటంతో వినియోగాదారులు దీనిపైనే ఎక్కువగా మెగ్గు చూపుతున్నారు. జీసీసీ (గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌) అడవిలో గిరిజనులు సేకరిస్తున్న సహజ సిద్ధమైన తేనెను శుద్ధిచేసి ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రూ.20 లక్షల నిధులతో నిర్మల్‌ ప్రాంతంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి సేకరించిన తేనెను ఇక్కడే శుద్ధిచేయడం జరుగుతోంది.
తేనె సేకరించేందుకు జీసీసీ కొంత మంది గిరిజనులకు గుర్తింపు కార్డులు ఇచ్చి అటవీ ప్రాంతంలో తేనె సేకరిస్తోంది. ఇందుకుగానూ ఆరు యూనిట్లను ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 2,240 మంది ఉన్నారు. వారే కాకుండా మిగతా వారు సేకరించిన తేనెను కూడా కొనుగోలు చేసి శుద్ధి చేస్తున్నారు..
శుద్ధి చేసిన తేనెను వివిధ పరిమాణాలు వర్జిన్‌ ప్లాస్టిక్‌ సీసాలలో నింపి 250 గ్రాములు, 500 గ్రాములు, కిలో ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. తేనెను ఢిల్లి , బెంగళూరు, చైన్నై రాష్ట్రంలో ప్రముఖ యాత్రికుల కేంద్రాలకు పంపిణీదారుల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. స్వచ్ఛమైన తేనె హోల్‌సేల్‌ డీలర్లకు కిలో రూ.250, రిటైల్‌ ధర రూ.300 విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 18మంది డీలర్లతో మార్కెటింగ్‌ చేయడం జరుగుతుంది. దీంతో వేలాది మంది గిరిజనులకు ఉపాధి కల్పించింది.
సమైక్య రాష్ట్రంలో గిరిజనులు చెట్లు, పుట్టలు తిరిగి సేకరించిన తేనెను విక్రయించాలంటే నానా తంటాలు పడేవారు. తెలంగాణలో శుద్ధి కర్మాగారాలు లేకపోవడంతో రాజమండ్రి, చిత్తూరు, అరకు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. అక్కడి వరకు వెళ్లలేని ఆదివాసీలు ఇక్కడే తక్కువ ధరకు దళారులకు విక్రయించడంతో పెద్దగా లాభమేమి వచ్చేది కాదు. ప్రస్తుతం తెలంగాణలో గిరిజనులు సేకరించిన తేనెకు ప్రాసెసింగ్‌ యూనిట్లు కిలో రూ.225 చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. దీంతో గిరిజనులు మా కష్టానికి మంచి ఫలితం వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లిప్‌కార్టులో గిరిజన ఉత్పత్తులు
తెలంగాణ ప్రాంత గిరిజనులు అడవిలో తిరిగి సేకరించిన తేనెను శుద్ధి చేసి ‘గిరి బ్రాండ్‌’ పేరుతో ఫ్లిప్‌కార్టులో విక్రయించేందుకు తెలంగాణ గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. త్వరలో కల్తీ తేనె బారిన పడుతున్న ప్రజలకు జీసీసీ అటవీ సంపద సహజ సిద్ధమైన తేనెను అందుబాటులోకి తేనున్నారు.

లాభాల్లో ప్రొసెసింగ్ యూనిట్

ఐదేండ్ల కింద ప్రారంభించిన తేనె శుద్ధికర్మాగారం యూనిట్‌ రూ.5.25 టర్నోవర్‌ చేయగా, 2020-2021లో రూ.79.21 లక్షల టర్నోవర్‌ చూసింది. ఇది కేవలం ఐదేళ్లలో 16 శాతం వృద్ధిని చవిచూసింది. ఇప్పటి వరకు రూ.3 కోట్ల తేనెను విక్రయించగా రూ.50 లక్షల లాభాల్లో ఉంది. ప్రాసెసింగ్‌ యూనిట్‌లో శుద్ధి చేసిన తేనెను అగ్మర్క్‌ (అగ్రికల్చర్‌ మార్కెంటింగ్‌) సంస్థ స్పెషల్‌ గ్రేడ్‌గా ధృవీకరించింది. ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా గుర్తించడంతో ఈ తేనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వచ్చింది.

తేనె సేక‌రించే గిరిజ‌నుల‌కు ప్ర‌త్యేక ర‌క్ష‌ణ కిట్లు…

అటవీ ప్రాంతాల్లో తేనె సేకరించే గిరిజనులకు ప్రత్యేక రక్షణ కిట్లు పంపిణీ చేసింది. ప్రతి ఏడాది బూట్లు, చేతి తొడుగులు, తాడులు, బకెట్లు, దుస్తులతో సహా ప్రత్యేక భద్రతా వస్తు సామగ్రిని సరఫరా చేస్తోంది. 7 నుంచి 10 మంది గిరిజనులతో కూడిన ఒక బ్యాచ్‌ రోజుకు 10 నుంచి 20 కిలోల తేనెను సేకరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement