Monday, April 29, 2024

హైదరాబాద్ : రహస్యాల పుట్ట

జడ్పీ చైర్మన్‌ పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్‌ పాత్రపై ఆధారాలు లభించడంతో పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్‌ చేయగా, తెరవెనుక ఉన్న ధైర్యం, భరోసా, సూత్రధారి ఎవరన్న అంశాలపై పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. న్యాయవాద దంపతులు గట్టు వామన్‌ రావు, నాగమణి #హత్య వ్యవహారంలో.. జడ్పీ చైర్మన్‌ పాత్ర ఉందని విపక్షాలు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తగ్గ నేపథ్యం ఉండడంతో పోలీసుల పాత్ర, దర్యాప్తు పై విమర్శలు వినబడుతున్నాయి. ఎవరినో దాచే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కొందరు పోలీసు అధికారులు సహకరించారన్న ఆరోపణల నేపథ్యం లో నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. రామగుండం కమిషనరేట్‌కు చెందిన అధికారులతో పాటు రామగిరి ఎస్‌ఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. జంట హత్యలపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కదం తొక్కుతుండగా, నేషనల్‌ బార్‌ కౌన్సిల్‌ కూడా హత్యను తీవ్రంగా నిరసించింది. రెండోరోజు విధులను బ#హష్కరించిన లాయర్లు కోర్టు ప్రాంగణాల్లో నిరసనలు చేపట్టారు. ఇక జడ్పీ చైర్మన్‌ మేనల్లుడే వాహనం సమకూర్చడం, హత్యకు ఉపయోగించిన కత్తులు సమకూర్చిన నేపథ్యంలో.. మొత్తం వ్యవహారంలో పెద్దల పాత్రపై ఆరోపణలు ముసురుకుంటున్నాయి. కొందరు పోలీసు అధికారుల సహకారం, ప్రమేయంపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
జడ్పీ చైర్మన్‌పై కేసులతో పోరాడిన వామన్‌రావు
జడ్పీ చైర్మన్‌ పుట్టా మధు ఎమ్మెల్యేగా ఉన్నపుడు అక్రమాస్తులు కూడబెట్టాడని, ఆయన అఫిడవిట్‌కు ఆస్తులకు సంబంధం లేదని ఆధారాలతో హైకోర్టులో కేసు ఫైల్‌ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. తర్వాత సోదరుని కుమార్తె ప్రేమ వివాహం అనంతరం వారికి రక్షణ కల్పించడం మరింత వైరం పెంచిందని, ఇక పుట్టా మధు సతీమణి పై పోటీ చేసిన ఆయేషా అనే యువతిని బెదిరించిన కేసునూ వాదించడం వంటి సంఘటనలు ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచాయని ప్రచారం జరుగుతోంది. మంధని, కాళేశ్వరం ప్రాంతంలో శాండ్‌ మాఫియా కూడా వీటి వెనుక ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్‌ కేంద్రంగా విచారణ
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు అడ్వకేట్స్‌ గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణ అంతా హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతోంది. వామన్‌రావు హత్య తర్వాత స్థానిక పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కేసు విషయంలో సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో రామగుండం పోలీసులతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఉన్నతాధికారులు ఈ కేసును మానిటరింగ్‌ చేస్తున్నారు. నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ అక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఉన్నతాధికారులకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. కేసులో ఎలా ముందుకు సాగాలో కూడా హైదరాబాద్‌ అధికారుల నుంచే సూచనలు వస్తుండడంతో వాటినే అమలు చేయాల్సిన పరిస్థితి తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఈ ఘటన విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలని పోలీసులు అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేస్తే బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో సీబీఐ రంగంలోకి దిగి వెలుగులోకి రాని వాస్తవాలను బయటకు తీస్తే రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతుందని గమనించిన ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణను కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement