Thursday, April 25, 2024

Delhi | విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధాని.. సుప్రీంకోర్టులో కేంద్ర హోంశాఖ పిటిషన్, 23న విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ విజభన చట్టం ప్రకారమే రాజధాని ఏర్పాటు జరిగిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటు జరిగిందని, అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని స్పష్టం చేసింది. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 23నే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారమే నిపుణుల కమిటీ వేసినట్లు గుర్తు చేసింది.

నిపుణుల కమిటీ సూచనలతో అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని హోంశాఖ చెప్పింది. విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని తెలిపింది. రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌తో పాటు ముఖ్యమైన పట్టణ మౌలిక వసతుల కల్పనకు డబ్బులివ్వాల్సి ఉందని పిటిషన్‌‌లో వివరించింది. కొత్త రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు మంజూరు చేశామని కేంద్ర ప్రభుత్వం ధర్మాసనానికి వెల్లడించింది. 2020లో రాష్ట్ర ప్రభుత్వం 2 కొత్త చట్టాలు తీసుకువచ్చిందని, సీఆర్‌డీఏ రద్దు, 3 రాజధానుల ప్రతిపాదనతో చట్టాలు చేసిందని వివరించింది. ఈ రెండు చట్టాలు తీసుకువచ్చే ముందు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదని హోం మంత్రిత్వ శాఖ వివరించింది.

ఇంతకుమించి సమాధానం చెప్పడానికి ఏమీ లేదని కౌంటర్‌లో అఫిడవిట్‌లో పేర్కొంది. నిపుణుల కమిటీ సిఫారసులు, సెక్షన్‌ 5, 6, 94కు సంబంధించిన డాక్యుమెంట్లు, 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ సీఆర్‌డీఏ చట్టంతో కూడిన జీవో 97 కాపీలను జత చేసింది. కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై ఈనెల 23న సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement