Thursday, April 25, 2024

Delhi | ‘విజిట్ ఇండియా 2023’తో పర్యాటకాభివృద్ధి.. మౌలిక వసతుల అభివృద్ధి మీదే ప్రధాన దృష్టి : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కరోనా తర్వాత భారత దేశ పర్యాటకాన్ని పూర్వస్థితికి తీసుకురావడంతోపాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి పెరిగేలా కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనతోపాటుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో పర్యాటక అభివృద్ధికి ‘విజిట్ ఇండియా-2023’ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

గుజరాత్‌లోని రణ్ ఆఫ్‌ కచ్‌లో బుధవారం జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఉపాధి కల్పనకు విస్తృతమైన అవకాశం ఉన్న పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా అన్ని జీ20 సభ్యదేశాలు కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.
భారతదేశం ఓవైపు ప్రకృతి రమణీయత కలిగిన పర్వాతాలు, అందమైన బీచ్‌లు, నదులు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నిర్మాణాలు.. మరోవైపు, చక్కటి వన సంపద, రాయల్ బెంగల్ టైగర్, గిర్ సింహాలు, ఒంటికొమ్ము రైనోలు వంటి వివిధ వన్యప్రాణులు, వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు కేంద్రమని ఆయన అన్నారు.

40 యునెస్కో చారిత్రక కేంద్రాలు, 14 యునెస్కో ఇన్ టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఎలిమెంట్స్, ఆధ్యాత్మిక కేంద్రంగా, 4 ధర్మాలకు పుట్టినిల్లుగా (హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం, జైనిజం), ఎన్నో రకాల పండగలు, ఉత్సవాలకు కేంద్రంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును పొందిందన్నారు. దేశంలో పర్యాటకాభివృద్ధికి గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు 7వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు స్వల్పకాల హాస్పిటాలిటీ కోర్సులు, స్కిల్ టెస్టింగ్ సర్టిఫికేషన్స్, వివిధ కార్యక్రమాల కోసం డిజిటల్ కోర్సులు ఏర్పాటు చేయడం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

దేశీయ, విదేశీ పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా యూనిఫామ్ టూరిజం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, గుజరాత్ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మును భాయ్ బేరా, గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ కుమార్, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్ తోపాటు జీ-20 సభ్య దేశాలతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, పర్యాటక రంగం భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement