Sunday, May 5, 2024

FollowUp : ముంచెత్తిన వరద.. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత.. 13 వరకు రెడ్‌ అలర్డ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారీ వర్షాలతో తెలంగాణను వరద ముంచెత్తుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు పొంగి పోర్లుతుండడంతో అనేక చోట్ల రోడ్లు ధ్వంసమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పలో చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. మరికొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. భారీ వర్షాలకు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేక ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని చెరువులు అలుగులు పారుతున్నాయి. గోదావరి, కృష్ణపై ఉన్న పలు ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తిసామర్థ్యానికి చేరుకోగా…. అదికారులు వరదను దిగువకు వదులుతున్నారు. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలకు రాష్ట్ర వ్యాప్తం పలు మండలాల్లో ప్రధాన రోడ్ల మీదుగా వరద ప్రవహిస్తోంది. పలు జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. రాష్ట్రంలో పలు చోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. వానాకాలం సాగుకోసం రైతులు పోసుకున్న నారుమళ్లు వరదలో మునిగిపోయాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

మరో మూడు రోజులు భారీ వర్షాలు
రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణకు మరో మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉండడంతో రెడ్‌ అల ర్ట్‌ను జారి చేసింది. ఇప్పటికే మూడు రోజుల రెడ్‌ అలర్ట్‌ ను ప్రకటించగా… మరో మూడు రోజులపాటు (ఈ నెల 13వరకు) భారీ వర్షాలు కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. పలు పట్టణాల్లో ఉన్న శిథిల భవనాలు, పురానత ఇళ్లపై అధికారులు దృష్టిసారించారు.

రాకపోకలకు తీవ్ర అంతరాయం…
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతుండడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లా పెద్దంపేట వాగు ఉధృతికి వంతెన తెగిపోవడంతో మహాదేవ్‌పూర్‌, పలిమేల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నడిమగూడెం – సజ్జలబోడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పడవటంచ, నాగారం గ్రామాల నుంచి గుండాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా బుగ్గవాగు ఉధృతితో కొత్త లింగాల-డోర్నకల్‌ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఖమ్మం-మహబూబాబాద్‌ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా నేరేళ్లగుట్ట వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. పెద్దవాగు ఉధృతితో ధర్మపురి, సారంగపూర్‌ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌ జిల్లా గుర్తూరులో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కంటాయపాలెం-గుర్తూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లాలో అనంతారం వాగు ఉధృతికి ధర్మపురి-జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంథని వద్ద వరద ఉధృతికి కొయ్యూరు ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కుమరంభీం జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, బెజ్జూరు, తిర్యాణి, కౌటాల, దహేగాం మండలాలతోపాటు ఉట్నూరు ఏజెన్సీలోని సిరికొండ, ఇంద్రవెల్లి, జైనూర్‌, నార్నూర్‌, సిర్పూర్‌ మండలాల్లో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

వరదలో బస్సు…
భూపాలపల్లి జిల్లా కాటారం దగ్గర కాళేశ్వరం గ్రావిటీ కెనాల్‌ పక్కన ఓ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు వరదలో చిక్కుకుంది. బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. చెరువులను తలపిస్తున్న పంట పొలాలు కామారెడ్డి జిల్లా బీర్కూరు మంజీరా నది ఆయకట్టును వరద ముంచెత్తింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. దాదాపు 500 ఎకరాల వరిపంట నీట మునిగి చెరువును తలపిస్తోంది. నిర్మల్‌ జిల్లా కిషన్‌రావుపేలో చెరువు కట్ట తెగి పంట పొలాలు నీట మునిగాయి. భద్రాచలం జిల్లాలో వరద ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ దేశించారు. నిజామాబాద్‌లో రెండో రోజు ఏకధాటిగా వర్షాలు కురవడంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు అలుగులు పారుతుండగా… వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కప్పు సరిచేస్తూ ఒకరు, ఇల్లు కూలి మరొకరి మృతి, ట్రాన్స్‌ ఫార్మర్‌ కంచెకు షాక్‌తో రెండు ఆవులు మృతి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో విషాదం నెలకొంది. వర్షాలకు ఇంటిపైకి ఎక్కి కవర్‌ కప్పుతుండగా… విద్యుదాఘాతంతో సాయిలు మృతిచెందాడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్‌లో ఇల్లు కూలిపోవడంతో ఓ వృద్దురాలు కన్నుమూసింది. భారీ వర్షాలకు ట్రాన్స్‌ ఫార్మర్లు ఉన్న ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. నిజామాబాద్‌లోని సీతారాంనగర్‌ కాలనీలో ట్రాన్స్‌ ఫార్మర్‌ ఇనుప కంచెకు షాక్‌ రావడంతో రెండు ఆవులు మరణించాయి. పశువులు మేపేందుకు వెళ్లిన నిజామాబాద్‌ గ్రామీణ మండలం లింగితండాకు చెందిన మక్కల నడిపి సాయిలు, దరంగుల రెడ్డి నిజాంసాగర్‌ కాలువలో గల్లంతయ్యారు.

జలదిగ్బంధంలో పలు గ్రామాలు
కూలిలన ఇళ్లు
..

- Advertisement -

మంథని ప్రాంతంలోని దామరకుంట, కటుకుపల్లి,కుంభంపల్లి గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. నిర్మల్‌ జిల్లా కిషన్‌రావుపేటలో చెరువుకు గండిపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జడ్పీ కార్యాలయం ఆవరణలోకి వరద నీరు చేరింది. జిల్లాలోని పలు గ్రామాల్లో కొన్ని ఇళ్లు పాక్షికం గా దెబ్బతినగా… మరికొన్ని పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఒక్కసారిగా అలుగు పారడంతో నసురుల్లాబాద్‌ మండలం నమిలిగ్రామంలో ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది. బాన్సువాడలో రేకులషెడ్డు కూలిపోవడంతో ముగ్గురు గాయపడ్డారు. బాన్సువాడ-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లిలో వరదలో చిక్కుకున్న గొర్ల కాపర్లను పోలీసులు రక్షించారు. శాలపల్లి వద్ద వరదలో గొర్లమందతోపాటు కాపర్లు చిక్కుకున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో నీల్వాయి, రాచర్ల గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుతున్నాయి. ప్రాణహిత పోటెత్తడంతో పిరసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గాలికుంట చెరువు మత్తడిపోయడంతో పట్టణంలోని పలు వీధుల్లోకి వరద నీరు వచ్చి చేరింది.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి..
భారీ వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొన్ని గనుల్లో రహదారులు కొట్టుకుపోయాయి. వరద నీరు గనుల్లోకి చేరడంతో అధికారులు నష్టనివారణా చర్యలు చేపట్టారు. పలు గనుల్లోకి నీరు చేరడంతో వాహనాలు లోపలికి వెళ్లకుండా నిలిచిపోయాయి. ఉపరితల గనుల్లో రహదారులన్నీ బురదమయం కావడంతో బారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు 7కోట్ల విలువైన 24వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఇల్లందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాకాలం ప్రారంభ సమయంలో, అదనులో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో చె రువులు అలుగులు పారుతుండడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడి పొలాలను వరద ముంచెత్తుతోంది.


పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం…
రాష్ట్రంలో అత్యధికంగా భూపాలపల్లి జిల్లా కొల్లూరులో 16.8సెం. మీ వర్షపాతం కురిసింది. జిల్లాలోని ముత్తారం, మహాదేవ్‌పూర్‌లో 13.7సీఎంబీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 13.2, నీల్వాయిల్‌లో 13.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా పాల్తెంలో 10.9సెం.మీ వర్షం కురిసింది. ములుగు జిల్లా తాడ్వాయిలో 7.2సెం.మీ. వర్షపాతం నమోదైంది.
జీహెచ్‌ఎంసీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు హె చ్చరిక జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తప్పనిసరి పని ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఎ లాంటి విపత్తులు సంభవించకుండా ప్రత్యేక సహాయ బృందాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు ప్రత్యేకంగా 21111111 టోల్‌ఫ్రీ నంబరును జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. కార్పోరేటర్ల తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ ప్రజలు చేసే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
జంట జలాశయాలకు పోటెత్తిన వరద జంట నగరాలకు ప్రధాన తాగునీటి వనరులైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది.దీంతో జలమండలి అధికారులు ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లను ఒక ఫీటు ఎత్తి వరదను దిగువన మూసీలోకి వదులుతున్నారు. దాదాపు 6800 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 1785.80 అడుగులకు చేరుకుంది. హిమాయత్‌సాగర్‌ పూర్తిసామర్థ్యం 1763.50 అడుగులు కాగా… ప్రస్తుతం 1760.30 అడుగులకు నీటిమట్టం చేరింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మూసి పరివాహ ప్రాంతాలను జలమండలి అప్రమత్తం చేసింది. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి అధికారులను జలమండలి ఎండీ అప్రమత్తం చేశారు.
అప్రమత్తంగా ఉండండి… ప్రజలకు ఏ ఇబ్బంది రావొద్ద

జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. నిండిన చెరువులు, కుంటల వద్ద ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే విధంగా ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక రక్షిత చర్యలను తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, ఆసీఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదై ందని తెలిపారు. ఈ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement