Tuesday, May 7, 2024

తిరుమలలో చిరుతల సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఫోకస్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : తిరుమలలో చిరుతల అలికిడి భక్తుల మదిలో గుబులు రేపుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే గత కొద్దిరోజులుగా భక్తులను వన్య ప్రాణుల భయం వెంటాడుతోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు నడక మార్గంలో వెళ్ళాలంటేనే హడలి పోతున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో చిన్నారి లక్షిత చిరుత బారిన పడి మరణించిన ఉదంతం తర్వాత ఈ మార్గంలో భక్తుల సంఖ్య దాదాపు మూడు రెట్లు తగ్గిపోయిందని టీటీడీ అధికారులు అంచనాకు వచ్చారు.

చిన్నారి ఘటనకు ముందు ఓ బాలుడిపై దాడి చేసి గాయపరిచిన ఘటన సైతం మరువలేనిది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన టీటీడీ చిరుతల సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కోసం సమీక్షిస్తోంది. ఇప్పటికే నడక మార్గంలో భక్తులను అడుగడుగునా అప్రమత్తం చేస్తూ గుంపులుగా పంపడమే కాకుండా వారి చేతికి రక్షణగా కర్రలు సిద్ధం చేసిన టీటీడీ మరింత రక్షణ చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా కాలినడకన కంచె ఏర్పాటు ప్రతిపాదన తెర మీదకు రావడంతో ఈ దిశగా పరిశీలన చేస్తోంది. ఈమేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం శనివారం మీడియా ఎదుట స్పష్టం చేశారు.

- Advertisement -

అప్పటి వరకు భక్తుల భద్రతకు భరోసా కల్పిస్తున్న టీటీడీ రక్షణ యంత్రాంగం రక్షణ చర్యలు కొనసాగిస్తోంది. మనుషులపై దాడులకు తెగబడి రక్తం రుచిమరిగిన చిరుతల నుంచి అత్యంత ప్రమాదకర పరిస్ధితులు ఉత్పన్నం కాకుండా తక్షణ చర్యగా చేపట్టిన ఆపరేష్‌ చిరుతను యంత్రాంగం కొనసాగిస్తోంది. ఇప్పటికే బోనులు ఏర్పాటు చేయడంతోపాటు నిఘా కెమేరాలను కూడా నిరంతర పర్యవేక్షణకు ఉంచారు. పులలకు తోడు ఎలుగుబంటిలు కూడా తోడవడంతో భక్తులకు వన్య ప్రాణుల నుంచి ప్రాణ భయం వెంటాడుతోంది.

ఇప్పటికే బోనులో చిక్కిన చిరుత పులుల మాట అలా ఉంచితే మరిన్ని వన్య ప్రాణుల సంచారం ఉన్నందున కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన అటవీశాఖ పోలీసు శాఖతో కలిసి ఆపరేషన్‌ రక్షక్‌ పేరుతో కొత్త వ్యూహం సిద్ధం చేసింది. అయితే నడకమార్గంలో కంచె ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన అటు భక్తులు, ఇటు ప్రజలు నుంచి వినిపించడంతో దీనిపై టీటీడీతోపాటు ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాలి నడకన వెళ్లే భక్తులు ఎదుర్కొంటోన్న చిరుతల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని, తిరుమలకు కాలినడకన వెళ్లే అన్ని మార్గాల్లో కంచె వేసే ఆలోచన చేస్తామని, దీనిపై నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటామని మంత్రి ప్రకటించిన మేరకు కంచెపై తీవ్ర చర్చ జరుగుతోంది.

కంచె సాధ్యమేనా..

తిరుమల నడక దారిలో కంచె ఏర్పాటుపై తెర మీదకు వచ్చిన నేపధ్యంలో అటు టీటీడీ, ఇటు ప్రభుత్వం, వివిధ శాఖలు నిపుణులను సంప్ర దించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కంచె ఏర్పాటుపై అధ్యాయనం చేస్తున్నట్లు ఆయా శాఖలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి అడ్డంకులు, అవరోధాలు, అనుకూల, ప్రతికూల పర్యావసానాలపై యంత్రాంగం సమీక్షిస్తోంది. ఏనిమిది వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న శేషాచలం అటవీ ప్రాంతాన్ని దేశంలోనే మూడో అతిపెద్ద బయోస్పియర్‌ రిజర్వ్‌గా కేంద్రం గుర్తించింది.

ఇక్కడ ఉండే అనేక జాతుల వన్య ప్రాణులను రక్షించడమే ముఖ్య ఉద్ధేశ్యం. దీంతో లీగల్‌ ప్రోటెక్షన్‌ కలిగిన ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టాలన్నా ఉన్నత స్ధాయి అనమతులు తప్పనిసరి. ఈ అటవీ ప్రాంతంలో సంచరించే, బతికే ఏ వన్యప్రాణులకు ఆటంకం కలిగేలా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం – 1972 ప్రకారం రిజర్వు ఫారెస్ట్‌లలో వన్యప్రాణుల కదలికలను అడ్డుకోవటం, హాని తలపెట్టే విధంగా చర్యలు చేపట్టటం నేరం. ఇప్పుడు తిరుమల నడకమార్గంలో కంచెలు ఏర్పాటు చేస్తే అది వన్యప్రాణుల స్వేచ్ఛను హరించటమే అంటున్నాయి కొని ్న స్వచ్చంద సంస్ధలు.

అదీకాక ప్రజల నుంచి వస్తున్న డిమాండు చూస్తే కంచే ఏర్పాటు మరింత ప్రమాదం అని కూడా అంటున్నారు విశ్లేషకులు. చిరుతలు, కొన్ని జాతుల జంతువులు ఎత్తుకు ఎక్కగలవు. చిరుత పలులు, ఎలుగుబంటు వంటి జంతువులు చెట్లు ఎక్కి పడుకుంటాయి కూడా. అలాంటిది పది అడుగుల లోపు ఉండే కంచె ఎత్తు చిరుతలను ఆపలేవు. అవి దూకి కంచె దాటి లోపలకి వస్తే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణభయంతో జనాల తొక్కిసలాటలో హడిలిపోయే జంతువులు తప్పించుకునే మార్గం లేక అక్కడే ఉన్న మనుషులపై మరింత దాడులకు తెగబడే ప్రమాదం ఉం దంటున్నారు.

ఈ నేపధ్యంలో కంచె ఏర్పాటుపై అధికార యంత్రాంగం పూర్తి స్ధాయిలో పరిశీలన చేస్తోంది. ఈలోగా ఆపరేషన్‌ రక్షక్‌ పేరుతో టీటీడీ, అటవీశాఖ సంయుక్త కార్యాచరణ చేపట్టింది. దీనిలో భాగంగా వన్య ప్రాణుల కదలికలపై మొత్తం 500 సీసీ కెమెరాలు వీటిలో మూడు ప్రాంతాల్లోనే 30 బోన్లు, 320 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఆపరేషన్‌ రక్షక్‌ కోసం ప్రత్యేక నిపుణుల బృందం ఒకటి శ్రీశైలం నుంచి తిరుమలకు రానున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement