Tuesday, April 30, 2024

AP | ఉప్పొంగిన కృష్ణా, గోదావరి.. నీట మునిగిన పంట పొలాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఉప నదులు పట్టకుండా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు సమీప గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. వివిధ పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఇప్పుడిప్పుడే వేగిరపరచేందుకు అన్నదాతలు సిద్ధమౌతున్న తరుణంలో వరదలు ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 35 వేల హెక్టార్లలో వివిధ పంటల సాగు చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకూ దాదాపు 10 వేల హెక్టార్లలో వివిధ పంటల సాగు ప్రారంభం అయినట్లు లెక్కలు వేస్తున్నారు.

నిన్నమొన్నటి వరకూ ఉన్న హీట్‌ వేవ్‌ కారణంతోపాటు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్‌ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వర్షాలు కురవడం ప్రారంభమవడంతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈనేపథ్యంలోనే వరి నారుమళ్లను పొసుకునేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని చోట్ల పెరిగిన నారును నాటుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక పప్పు ధాన్యాలు, పత్తి, చెరకు, కూరగాయల వంటి వివిధ రకాల పంటల సాగు వివిధ దశల్లో ఉంది. తాజాగా అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పటి వరకూ సాగు మొదలైన పది లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నాలుగు లక్షల హెక్టార్లల్లో వరి నారుమళ్లతోపాటు వరి నాట్లు జరిగిన పరిస్తితులు ఉండొచ్చని తెలుస్తోంది.

ఇక మిగిలిన ఆరు లక్షల హెక్టార్లలో కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, నంద్యాల, తూర్పు గోదావరి, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, పల్నాడు, తిరుపతి వంటి జిల్లాల్లో వేరుశనగ, మొక్కజొన్న వంటి పలురకాల పంటలు సాగైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి పంటలు విత్తడం పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాలు ఆగిపోయినా పై నుండి వస్తున్న వరదల కారణంగా పంట పొలాలు నీట మునిగిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల తరువాత సాగు ప్రారంభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఈక్రమంలోనే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాల మూలంగా సాగువుతున్న పంటలకు పెద్దగా నష్టం వాటిల్లే అవకాశాలు లేవని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరద నీరు పొలాల నుండి బయటకు వెళ్లిన ఒకటి రెండు రోజుల తరువాత పంటల సాగు యథావిధిగా చేపట్టుకోవచ్చని స్పష్టంచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం వచ్చిన వరదల మూలంగా ఎక్కడైనా పంటలకు నష్టం జరిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్‌ చేస్తామని వారు చెబుతున్నారు.

- Advertisement -

సరిహద్దు రాష్ట్రాలకు రాకపోకలు బంద్‌

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతోపాటు తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. జాతీయ రహదారులు కూడా మునిగిపోవడంతో రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65)పై నీరు నిలవడంతో గురువారం నుండి రాకపోకలు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ రూట్లలో బస్సులు తిప్పుతున్నారు.

ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పలు రహదారులు నీట మునిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ నుండి ఒడిషా, చత్తీస్‌ఘడ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని చత్తి వద్ద ఎన్‌హెచ్‌-30పై నీరు నిలిచిపోవడంతో జగదల్‌పూర్‌, ఛత్తీస్‌ఘడ్‌ వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం నడక దారిన కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అత్యవర సేవలైప ఆసుపత్రులకు వెళ్లేవారికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపుతున్నారు. చింతూరు-కల్లేరు మధ్య ఉన్న బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండటంతో ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు.

42 మండలాల్లో తీవ్ర ప్రభావం

రాష్ట్రవ్యాప్తంగా 42 మండలాల్లోని 458 గ్రామాలకు ముంపు బాధ ఎక్కువగా ఉంది. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలో ఎక్కువగా వరద ఉధ్రుతి కనిపిస్తుంది. ముంపు మండలాల పరిధిలో వరద సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈక్రమంలోనే సీఎం జగన్‌ ఈ జిల్లాల పరిధిలో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు రూ. 12 కోట్లు కేటాయించారు. దీంతో అధికారులు పునరావాస, సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement