Sunday, September 24, 2023

Big story | పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ.. ప్రత్యేక నిధులతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్థానిక పాలనకు పట్టం కడుతోంది తెలంగాణ సర్కార్‌. పంచాయతీల స్వయం ఆర్ధిక స్వావలంభనకు తెలంగాణ సర్కార్‌ అండగా నిలుస్తోంది. దేశంలో ఎక్కడాలేని రీతిలో సర్కార్‌ స్థానిక పాలనకు మరింత ఊతమిస్తోంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఎక్కడ పర్యటించినా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సొంత విచక్షణ మేరకు భారీగా నిధులను కేటాయిస్తున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి స్పెషల్‌ ఫండ్‌నుంచి ఒక్కో పంచాయతీకి రూ. కోట్ల నిధులను విడుదల చేస్తున్నారు. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఒక్కో పంచాయతీకి రూ. 15లక్షల నిధులను ప్రకటించడం విశేషం.

- Advertisement -
   

తెలంగాణలోని గ్రామ పంచాయతీలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని పల్లెల్లో అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అమలు చేస్తున్న విధానాలు, స్కీమ్‌లనే ఇటీవల ఆర్బీఐ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆచరించాలని సూచించడం విశేషం. స్టడీ ఆన్‌ స్టేట్‌ ఫైనాన్సెస్‌ పేరుతో ఇటీవల ఆర్బీఐ నిర్వహించిన అధ్యయనంలో కొవిడ్‌నుంచి మొదలు మంచినీరందజేత వరకు, ఆర్ధిక ప్రగతినుంచి స్థానిక వనరుల వినయోగం దాకా ప్రముఖ పాత్ర పోషించిందని వెల్లడైంది. ఈ అధ్యయనం ఆధారంగా కొవిడ్‌ పరిస్థితుల్లో స్థానిక సంస్థల కృషిని ఆర్బీఐ కొనియాడింది.

రాష్ట్ర ప్రభుత్వాల వనరులతోనే కాకుండా, కేంవద్ర సఆయంలో నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీలు వనరుల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపింది. కేవలం పన్నులు, ఫీజులు, సాధారణ గ్రాంట్లు కాకుండా గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులిచ్చి వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆర్బీఐ సూచించింది. కొవిడ్‌లాంటి సంక్షోభ సమయంలో క్షేత్రస్థాయిలో వాటి పనితీరు చూసిన తర్వాతైనా ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, అనూహ్యంగా ఆర్బీఐ సూచించిన విధానాలు తెలంగాణలో ఇటు పట్టణ, అటు గ్రామీణ స్థానిక సంస్థల విషయంలో పక్కాగా అమలవుతున్నాయి.

పట్టణ, పల్లె ప్రగతిల పేరుతో ఇప్పటికే అమలవుతున్న స్కీమ్‌లతో ఒక పక్క మునిసిపాలిటీలు, మరో పక్క గ్రామపంచాయతీలు ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రత్యేక నిధులతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల క్రమం తప్పకుండా ఇచ్చే ఈ నిధులతో అనేక అభివృద్ధి చర్యలు అమలుకు ఎంతగానో ఉపయోగపడిన విషయం తెలిసిందే. 2018లో నూతన పంచాయతీ రాజ్‌ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని 12,770 గ్రామ పంచాయతీల అభివృద్ధి పరుగులు పెట్టింది. పల్లెల అభివృద్ధి కోసం 2019 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం దేశంలోనే గొప్ప స్కీమ్‌గా పేరు ప్రఖ్యాతులు గాంచింది.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంటుకు తోడు అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటును కలిపి ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు వాటి జనాభా ప్రాతిపాదికన నిధులను అందజేస్తోంది. ఇందుకుగాను అన్ని పంచాయతీలకు కలిపి నెలకు రూ.500 కోట్ల వరకు పల్లె ప్రగతి నిధులుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నిధుల్లో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి పరిపాలన ఖర్చుల కింద కనీసం రూ.5 లక్షలు అందజేస్తోంది. గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికిగాను అందుబాటులో ఉన్న ఆర్థిక, మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది.

పల్లె ప్రగతిలో భాగంగా పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలను శుభ్రపరచడంతో పాటు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేసి నిర్మాణ వ్యర్థాలను తొలగించడం వంటి ప్రాథమిక పనులను ప్రభుత్వ నిధుల్లో నుంచే చేపడుతున్నారు. ఇప్పటివరకు పలు దశల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఒక్క షెడ్డుకు రూ.2 లక్షల 30 వేల ఖర్చుతో చెత్త వేరు చేసే షెడ్లను, రూ.12.5 లక్షల ఖర్చుతో ఘన వ్యర్థాలను తరలించడానికి ట్రాక్టర్ల కొనుగోలు, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా భారీగా మొక్కలు నాటడం వంటి పనులకు నిధులను ఖర్చుచేశారు.

ఇవి కాకుండా గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పల్లె ప్రగతికిగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2373 కోట్లు విడుదల చేయగా గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో పల్లె ప్రగతికి రూ.3079 కోట్లను విడుదల చేసింది.2022-23లో 5వేల కోట్లతో ఈ తరహా విధానాలతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చేసి పల్లెలను అభివృద్ధి పథాన ప్రభుత్వం నిలబెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, ఇతర రాజకీయ విశ్లేషకులు పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement