Wednesday, May 1, 2024

రైతు సంక్షేమమే బీఆర్ ఎస్ ల‌క్ష్యం.. ఫ్రీ కరెంట్‌, ద‌ళిత‌ బంధు, సాగునీరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రైతు సంక్షేమమే లక్ష్యంగా భారతీయ రాష్ట్ర సమితి (భారాస) ముందడుగు వేస్తోంది. ఆ దిశగానే పార్టీ అధినాయకుడు, సీఎం కేసీఆర్‌ జాతీయ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అమలు చేయలేని అంశాలను అజెండాలో చేర్చి దేశ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఉచిత విద్యుత్‌, రైతు బంధు, సాగునీటి వినియోగం అంశాలు ఆయుధంగా ముందడుగు వేస్తున్నారు. ప్రధానంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న రైతు సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానం, అందుకు అందుబాటులో ఉన్న సహజ వనరుల వినియోగమే నినాదంగా భారాస బలోపేతానికి కృషి చేస్తున్నారు.

ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి, జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన ”బీఆర్‌ఎస్‌’’ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్న రైతు సమస్యలు, వారి అభివృద్ధికి తక్షణం అమలు చేయాల్సిన కొన్ని ప్రత్యేక పథకాలు, నిర్లక్ష్యానికి గురవుతున్న కొన్ని సహజవనరుల వినియోగం తదితర అంశాలను అజెండాగా ఎంచుకుంది. దేశ ప్రజలు, ముఖ్యంగా రైతుల తక్షణ అవసరాలు తీర్చే పార్టీగా చొచ్చుకుపోవాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. మొన్నటివరకు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో చిన్న కమతాల సంఖ్య అధికంగా ఉంది. తెలంగాణలో రైతుల ఆర్థిక సుస్థిరతకు దోహదపడుతున్న రైతు బంధు, రైతు బీమా పథకాలను జాతీయస్థాయిలో విస్తరిస్తే.. సాధించే ఫలితాలను, సహజ వనరుల వినియోగానికి అనుసరించే విధానమే లక్ష్యంగా కేసీఆర్‌ తన ప్రసంగాలతో ఆకట్టుకోనున్నారు.

- Advertisement -

అదే అజెండాతో ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగు పెట్టబోతోతున్నారు. ఇకనుంచి వరుసగా ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో చేరికలకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన రెండోరోజే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో పలువురు ప్రముఖులు పార్టీలో చేరారు. రాజకీయాల్లో ఆసక్తి ఉన్న కేంద్ర సర్వీసు ఉద్యోగులకు ఇప్పటికే కేసీఆర్‌ ఆహ్వానం పలికారు. అన్ని రాష్ట్రాల్లో పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారులకు అధికారులకు లేఖలు కూడా రాశారు. అధికారాన్ని పక్కనపెట్టి బీఆర్‌ఎస్‌ ఏర్పాటు తర్వాత దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నారు. దీని ద్వారా ప్రధానంగా ఏపీలో టీడీపీ, జనసేన మాజీ నేతలపైన బీఆర్‌ఎస్‌ గురిపెట్టినట్లు స్పష్టం అవుతోంది. అయితే, రాయలసీమకు చెందిన ఒక కీలక నేత కుటుంబం కూడా కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.

జనవరి నెలాఖరులోగా సీఎం కేసీఆర్‌ అమరావతిలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా అడుగు పెట్టనున్నారు. త్వరలోనే విజయవాడ సమీపంలో పార్టీలో చేరిన నేతలు, చేరబోతున్న నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ఏర్పాటు లక్ష్యంతో పాటుగా ఏపీలో తన పార్టీ విధి విధానాలను వివరించనున్నారు. కడప జిల్లాకు చెందిన ఒక సీనియర్‌ నేతతో పాటుగా.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు బీఆర్‌ఎస్‌లో చేరే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఈ నేతలు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు చేరికలు మొదలుకావడంతో ఈ తరహా నేతలంతా ఇక బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్‌కు ఎవరెవరు దగ్గరయ్యే అవకాశం ఉందనే లెక్కల్లో ప్రధాన పార్టీల నేతలు ఫోకస్‌ పెట్టారు.

తొలుత ఆరు రాష్ట్రాల్లో…

తొలిదశలో ఆరు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు చేపట్టాలని కేసిఆర్‌ నిర్ణయించారు. త్వరలో అసెంబ్లి ఎన్నికలు జరగనున్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, మహారాష్ట్ర, ఒడిసా రాష్ట్రాల్లో ముందుగా పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో రైతు నేతల మద్దతు పొందడం, వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఈ ఆరు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ రైతు విభాగమైన కిసాన్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు వ్యవసాయాన్ని, సాగునీటి రంగాన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేస్తున్నాయని సీఎం కేసీఆర్‌ పలుమార్లు తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని తాము సమూలంగా మార్చివేస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. ఈ దిశగా ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అధికారిక ఆవిర్భావం రోజే ఈ విషయాలను వెల్లడించారు.

దీనికి అనుగుణంగానే పార్టీ కిసాన్‌ సెల్‌లను తొలిదశలో ఆరు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. మరోవైపు ఈ నెలాఖరున ఢిల్లి వేదికగా జాతీయ మీడియాతో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో సమావేశమై.. బీఆర్‌ఎస్‌ విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను అధినేత కేసీఆర్‌ వెల్లడించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి పలు ఇతర రాష్ట్రాలను, ప్రత్యేకించి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను, రాజకీయ నాయకులను కూడా విపరీతంగా ఆకర్షిస్తుందన్నది కేసీఆర్‌ మనసులో ఉన్న మాట. ఇటీవల ఢిల్లిdలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వంటివారితోపాటు అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది దాకా పలువురు నేతలు హాజరైన సందర్భంలో ఈ విషయాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అవసరమైన చర్యలు పార్టీ అధినేత కేసీఆర్‌ తీసుకుంటున్నారు. ఈ మేరకు కన్నడ, ఒరియా, మరాఠా వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో ఆయన సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో రావాల్సిన గుణాత్మక మార్పులపై కూడా అధ్యయనం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement