Wednesday, May 8, 2024

Delhi | కీలక మార్గాల్లో డబ్లింగ్, ట్రిప్లింగ్, 4-వరుసలకు విస్తరణ.. 7 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కీలక ప్రాజెక్టులకు మోక్షం లభించింది. దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానం చేసే మార్గాల్లో డబ్లింగ్, ట్రిప్లింగ్, 4 వరుసల విస్తరణ పనుల కోసం ఏకంగా రూ. 32,500 కోట్లతో 7 ప్రాజెక్టులను బుధవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. వాటిలో మూడు ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – పూణే, విశాఖపట్నం – కోల్‌కత్తా మధ్య ప్రయాణ వేగాన్ని, సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రాజెక్టులు కీలకం కానున్నాయి.

ఈ ప్రాజెక్టుల ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ ఏడు ప్రాజెక్టులు పూర్తయితే రవాణా సౌలభ్యం పెరగడంతోపాటు రద్దీ కూడా తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భారతీయ రైల్వేలో అత్యంత రద్దీ మార్గాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయని వెల్లడించింది.

మొత్తంగా ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 9 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ పరిధిలోని 35 జిల్లాలకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే ఉన్న రైలు మార్గాల నెట్‌‌వర్క్‌కు అదనంగా 2,339 కిలోమీటర్ల పొడవైన మార్గం చేరుతుంది. ఈ పనులతో ఆయా రాష్ట్రాల్లోని కార్మికులకు 7.06 కోట్ల పనిదినాల మేర ఉపాధి లభిస్తుంది..

- Advertisement -

ఆహారధాన్యాలు, ఎరువులు, బొగ్గు, సిమెంట్, ఫ్లై-యాష్, ఐరన్, ఉక్కు ఉత్పత్తులు, క్లింకర్స్, ముడిచమురు, సున్నపు రాయి, వంటనూనెలు తదితర వివిధ రకాల వస్తు రవాణాలో ఈ మార్గాలు చాలా కీలకం. ఈ మార్గాల్లో సామర్థ్యం పెంపు కారణంగా 200 మిలియన్‌ టన్నుల సరకు రవాణా (ఎంటిపిఎ) సామర్థ్యం పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. రైల్వేలు పర్యావరణ అనుకూలమైనవే ఇంధన పొదుపుతో కూడినవి కావడం వల్ల వాతావరణంలో కాలుష్య కారకాలను తగ్గించాలన్న లక్ష్యాల సాధనతోపాటు దేశంలో రవాణా వ్యయాన్ని తగ్గించడంలో తోడ్పడతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

మంత్రివర్గం సమావేశం అనంతరం నేషనల్ మీడియా సెంటర్లో ఈ ప్రాజెక్టుల గురించి సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానమంత్రి స్వప్నిస్తున్న నవ భారత రూపకల్పన దిశగా ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘పిఎం-గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక’కు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను సమీకృత ప్రణాళిక ద్వారా అమలు చేస్తున్నట్టు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు


బీబీనగర్ – గుంటూరు..

ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ అందుబాటులో ఉంది. ఎదురుగా వచ్చే రైలు కోసం దగ్గరిలోని స్టేషన్ వద్ద రైలును నిలిపివేయాల్సి ఉంటుంది కాబట్టి సింగిల్ లైన్‌లో రాకపోకల్లో రైళ్ల వేగం మిగతా మార్గాలతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. హైదరాబాద్ – చైన్నై మధ్య రైళ్ల రాకపోకలు కాస్త చుట్టు తిరిగి కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా జరుగుతున్నాయి.

బీబీనగర్ – గుంటూరు మధ్య డబ్లింగ్ పనులు పూర్తయితే ప్రయాణ దూరం 76 కి.మీ మేర తగ్గనుంది. 239 కి.మీ పొడవైన ఈ మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు కేంద్రం రూ. 2,853.23 కోట్లు ఖర్చు చేయనుంది. సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్న ఈ మార్గంలో సిమెంట్ రవాణాకు ఊతమివ్వడంతో పాటు, హైదరాబాద్ – చెన్నై నగరాల మధ్య ప్రయాణ వేగం పెరగనుంది. వందేభారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లకు ఈ మార్గం మరింత వీలు కల్పించనుంది.

ముద్కేడ్ – మేడ్చల్ (హైదరాబాద్ సిటీ) & మహబూబ్‌నగర్ – డోన్:

ఈ రెండు మార్గాల్లో ముద్కేడ్ – మేడ్చల్ మధ్య సింగిల్ లైన్‌ అందుబాటులో ఉంది. దీన్ని డబ్లింగ్ చేయడం ద్వారా అత్యధికంగా తెలంగాణలోని పశ్చిమ ప్రాంతం, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు విస్తృత ప్రయోజనం కలుగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి వెళ్లే ప్రయాణికులకు సమయం ఎంతో ఆదా అవుతుంది.

మరోవైపు మహబూబ్‌నగర్ – డోన్ మధ్య ఇప్పటికే ఉన్న సింగిల్ లైన్‌ను డబ్లింగ్ చేయనున్నారు. మొత్తంగా ఈ రెండు మార్గాలు కలిపి ఒకే ప్రాజెక్టుగా కేంద్రం రూ. 4,686.09 కోట్లు ఖర్చు చేయనుంది. అంటే ముద్కేడ్ నుంచి నేరుగా డోన్ వరకు రెండు వరుసల రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే ఉన్న మేడ్చల్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబుల్ లైన్ ఉన్నందున ఆ కాస్త దూరాన్ని మినహాయించి మొత్తం 417.88 కి.మీ మేర డబ్లింగ్ పనులను కేంద్రం చేపట్టనుంది.

మహబూబ్‌నగర్-డోన్ మధ్య డబ్లింగ్ పూర్తయితే హైదరాబాద్ – బెంగళూరు నగరాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గుతుంది. ప్రస్తుతం చుట్టుతిరిగి కర్ణాటక మీదుగా ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ – బెంగళూరు మధ్య కొన్ని గంటల వ్యవధిలో ప్రయాణం సాగించే సెమీ హైస్పీడ్ వందే భారత్ వంటి రైళ్లు పరుగులు తీయనున్నాయి. అలాగే రాయలసీమలోని ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకు ఈ మార్గం వీలు కల్పించనుంది.

నెర్గుండి – విజయనగరం:

కోల్‌కత్తా – చెన్నై నగరాలను కలిపే ఈ మార్గంలో ఇప్పటికే డబుల్ లైన్ అందుబాటులో ఉంది. అయితే ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉన్న చోట మూడవ వరుస నిర్మాణ పనులు కొన్ని జరుగుతున్నాయి. అందులో భాగంగా హౌరా – కటక్ మధ్య ట్రిప్లింగ్ పనులు జరుగుతుండగా.. తాజాగా కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదించిన ప్రాజెక్టులో భాగంగా కటక్ సమీపంలోని నెర్గుండి నుంచి విశాఖపట్నం సమీపంలోని విజయనగరం వరకు 3వ లైన్ అదనంగా ఏర్పాటు కానుంది.

దాంతో ఈ మార్గంలో సరకు రవాణా, ప్రయాణికుల రైళ్లకు ఎంతో ఉపయోగం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాకు దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 385 కి.మీ పొడవైన ఈ మార్గంలో ట్రిప్లింగ్ కోసం కేంద్రం రూ. 4,962.87 కోట్లు ఖర్చు చేయనుంది.


కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 7 ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల మీదుగా సాగే ఈ మూడు ప్రాజెక్టుల విలువ రూ. 12,502.19 కోట్లు. అంటే మొత్తం రూ. 32,500 పనుల్లో దాదాపు 40 శాతం ఈ ప్రాజెక్టుల కోసం ఖర్చవుతుంది. 


Advertisement

తాజా వార్తలు

Advertisement