Monday, April 29, 2024

మత్తులో ఎక్సైజ్‌శాఖ.. లేట్​నైట్​ పార్టీలపై పట్టించుకోని అధికారులు

హైదరాబాద్, ప్రభన్యూస్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వైన్స్‌లకు ఉదయం 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు, బార్లు, పబ్‌లకు ఉదయం 10గంటల నుంచి రాత్రి 12గంటల వరకు, వీకెండ్‌లలో రాత్రి ఒంటి గంట వరకు లిక్కర్‌ అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అనుమతులు ఇచ్చింది. గతంలో వైన్స్‌లకు రాత్రి 10గంటల వరకు, బార్లు, పబ్‌లకు 11గంటల వరకు మాత్రమే అనుమతి ఉండేది. తెలంగాణ ఏర్పాడ్డాక హైదరాబాద్‌ నగరం ప్రపంచ పటంతో పోటీ పడుతూ అత్యంత వేగంగా అభివృధ్ది వైపు పరుగులు పెడుతోంది. సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, ఇన్‌ఫ్రా, సినీ తదితర రంగాలకు చెందిన ఎంతో మంది ప్రతి రోజు నగరానికి వస్తున్న నేపథ్యంలో సర్కార్‌ లిక్కర్‌ అమ్మకాలసమయాన్ని పెంచింది. అయినా పబ్‌లు, బార్లు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు ప్రభుత్వం ఇచ్చిన సడలింపును సైతం దాటి విచ్చలవిడిగా తెల్లవారు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. లేట్‌నైట్‌ పార్టీలు, డీజేసౌండ్లు, అశ్లిల నృత్యాలతో నగర వాతావరణాన్ని చెడగొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా సమయం దాటిన తర్వాత‌ అమ్మకాలు సాగించడంతో పాటు మైనర్లకు పబ్‌లలో అనుమతినివ్వడం, గంజాయి తదితర మత్తు పదార్థాలను సరఫరా చేయడం లాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. లేట్‌నైట్‌ వీకెండ్‌ పార్టీలు పెట్టి యువత దగ్గర అడ్డంగా దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ తరహ సంస్కృతికి అడ్డుకట్ట వేయకుంటే నగర ప్రతిష్ట మంటగలిచే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఇన్‌ హౌజ్‌ లిక్కర్‌..

ఇన్‌ హౌజ్‌ సర్వీసింగ్‌ అనే ప్రాతిపదికన హైదరాబాద్‌ నగరంలోని కొన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లు 24 గంటల లిక్కర్‌ సరఫరాకు అనుమతి పొందా యి. అయితే ఈ హోటళ్లు ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి విచ్చల విడిగా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. 24 గంటల అనుమతి పొందేందుకు చేసిన దరఖాస్తు, దానిననుసరించి ఆబ్కారి శాఖ ఎలాంటి షరతులకు లోబడి అనుమతించింది తదితర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనిపై అబ్కారి శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. సర్కార్‌ 24 గంటల లిక్కర్‌ సరఫరాపై వివరాలు వెల్లడిస్తే కాని వాస్తవాలు బయటకు రావు.

అమ్నేషియా పబ్‌పై చర్యలకు మీన మేషాలు..

అమ్నేషియా పబ్‌లో జరిగిన దారుణ ఘటనపై ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జరిగిన ఘటనకు ఆబ్కారీ శాఖకు సంబంధం లేదు.. ఇంత వరకు కరక్టే అయినా మైనర్లకు పబ్బుల్లో అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా ఘటనకు కారణమై పార్టీలో లిక్కర్‌ సర్వ్‌ చేయలేదని తేల్చేశారు. పబ్‌లో జరిగిన ఘటనలో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి జూవైనల్‌ హోంకు తరలించారు. పబ్‌లలో మైనర్ల అనుమతిపై వివరణ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ పబ్‌పై చర్య తీకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement