Tuesday, April 30, 2024

One Nation One Election – జ‌మిలీ ఎన్నికల‌పై మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప‌రిశీల‌నా క‌మిటి

న్యూఢిల్లీ – దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వం వహించనున్నారు. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పలు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికల ‌అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’కు అవకాశాలను కోవింద్‌ కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులున్నారు.. మాజీ ఎన్నికల కమిషనర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, పలువురు విద్యావేత్తలు ఈ కమిటీలో ఉన్నారు.

మరోవైపు సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు అనూహ్య ప్రకటన చేసింది. అయితే, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాగా, ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక బిల్లును తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement