Saturday, May 4, 2024

మనం తినేదంతా కల్తీయే… మార్కెట్లో దొరికేవన్నీ అట్లాంటియే…

ప్రభ న్యూస్ : మా తాత గారు 120 ఏళ్ళు బ్రతికారు, మా అమ్మమ్మ 70 ఏళ్ళు వచ్చినా సంపూర్ణ ఆరోగ్యంగానే ఉంది అని చెప్తుంటాం. కానీ మనకి 30 ఏళ్లు దాటకముందే లేనిపోని కొత్త జబ్బులు అన్ని వస్తున్నాయి. మూడో తరగతిలోనే పిల్లలకు కళ్ల జోడ్లు, పదో తరగతికే తెల్లజుట్టు రావడం, 40 ఏళ్లకే మోకాలి నొప్పులు రావడం ఇప్పుడు సహజమైపోతుంది. దీనికి కారణం కేవలం మనం తినే ఆహారం మాత్రమే. ఆ కాలంలో పెద్దలు గ్రామాల్లో స్వచ్ఛమైన, తాజా కూరగాయలు పండించుకొని తినడం, ప్రతిరోజూ ఏదో ఒక పనిలో మునిగిపోవడం చేస్తుండేవారు. ఎన్ని కిలో మీటర్లు అయినా కాలినడక వెళ్లేవారు, ఎంత పనైనా చేసేవారు. కానీ మనం ఈ టెక్నాలజీ కాలంలో కష్టపడే పనికి గుడ్‌ బాయ్‌ చెప్పి షార్ట్‌ కట్‌లు వెతుకుతున్నాం. అందుకే మనం ఎర్లీ ఏజ్‌ లోనే కొత్తకొత్త జబ్బులు చూస్తున్నాం. పసుపు, కారం పొడిలు, పాల ప్యాకెట్‌లు ఇలా అన్ని రెడీమేడ్‌ వస్తువులు వెతుకుతున్నాం. దీనికి తోడు కొందరు వ్యాపారాలు ధనార్జనే లక్ష్యంగా జనాలను మాయలో పడేస్తూ కల్తీ వాటికి, స్వచ్ఛమైన వాటికి తేడా పసిగట్టలేకుండా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు కల్తీ వస్తువుల విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎందెందు వెతికినా అందందు కలదు అన్నట్టు అన్ని రకాల నిత్యావసర సరుకులను జోరుగా కల్తీ చేస్తున్నారు. నాణ్యతలేని సరుకులను తెచ్చి మార్కెట్‌ ధరలకు కొంచెం తక్కువ చేసి విక్రయిస్తూ వినియోగదారులను నిలువునా ముంచుతున్నారు. ఒకవైపు నిత్యావసర ధరలో మండిపోతుండడంతో కొందరు జనాలు కూడా తక్కువ ధరలకు వచ్చే వస్తువులను కొంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు వ్యాపారులు అయితే నకిలీవి, స్వచ్ఛమైనవి అనే తేడా లేకుండా కొంచెం కూడా అనుమానం రాకుండా వెరైటీ వెరైటీ స్ట‌యిల్‌లలో ప్యాక్‌ చేస్తూ మార్కెట్‌లోకి విడిచి పెడుతున్నారు. ఇటువంటి కల్తీ పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణకోశ, క్యాన్సర్‌, గుండె జబ్బులు ఒకటేమిటి అంతుపట్టని రోగాలు మనపై దాడి చేస్తున్నాయి. నకిలీల నివారణకు పలు ప్రభుత్వ శాఖలున్నా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఏదో ఒక్క రోజు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోతారు.. మళ్ళీ అటు కన్నెత్తి కూడా చూడరు అన్నది అందరికి తెలిసిన రహస్యమే. కానీ ఇదిలానే కొనసాగితే 100 ఏళ్ల లైఫ్ టైం కాస్తా 80 నుండి 70 ఏళ్లకి పడిపోతుంది. మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పటికైనా ఫుడ్‌ సేప్టీ అధికారులు, ప్రభుత్వాలు ఈ కల్తీ దందాపై దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు రక్షించ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement