Sunday, April 28, 2024

Delhi | బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభానికి అంతా రెడీ.. ఢిల్లీ చేరుకున్న కేసీఆర్​కు ఘన స్వాగతం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నవ చండీయాగం సహా వేదమంత్రాలతో కార్యాలయ భవనాన్ని ప్రారంభించేందుకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో అద్దెకు తీసుకున్న భవనంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ సూచనల మేరకు ఈ భవనంలో మార్పులు చేర్పులు, ఇతర మరమ్మతు పనులను పూర్తి చేశారు.

బుధవారం జరగనున్న పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ప్రాంగణంలోని వెనుకభాగంలో యాగశాలను నిర్మిస్తున్నారు. వేద పండితుల సూచన మేరకు నిర్ణీత నిష్పత్తిలో మూడు హోమ గుండాలతో యాగశాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యాకలాపాల కోసం భవనం లోపల పార్టీ జాతీయాధ్యక్షుడు సహా జాతీయస్థాయి నేతలు, కార్యాలయ సిబ్బంది కోసం గదులు సిద్ధమయ్యాయి. అలాగే పార్టీ నేతల సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించడం కోసం స్టేజితో కూడిన హాల్‌ను సిద్ధం చేశారు.

కార్యాలయం ఉన్న ఎస్పీ మార్గ్‌లో భారీస్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో కూడిన ఎత్తైన ఫ్లెక్సీలకు తోడు ‘కేసీఆర్ ఫర్ ఇండియా’ తదితర ఫ్లెక్సీలతో మరికొన్ని ఫ్లెక్సీలు ఆ ప్రాంతంలో దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు పోటాపోటీగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం గులాబీమయంగా మారింది.

ఏర్పాట్ల పర్యవేక్షణలో గులాబీదళం బిజీబిజీ
బుధవారం జరగనున్న కార్యాలయ భవనం ప్రారంభోత్సవం కోసం జరుగుతున్న ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పర్యవేక్షించారు. ఇందుకోసం మూడు రోజులు ముందుగానే ఢిల్లీ చేరుకున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ ఆదివారమే అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. యాగశాల నిర్మాణం సహా ఈవెంట్ పనులను కేఎంకే సంస్థకు అప్పగించారు. తాత్కాలిక నిర్మాణమే అయినప్పటికీ యాగశాలను బలమైన ఉక్కు ఉపయోగించి నిర్మిస్తున్నారు.

- Advertisement -

సోమవారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, సీఎం కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి రమేశ్ హజారి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం సమయంలో ఎంపీలు నామ నాగేశ్వర రావు, రాములు, దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, బీబీ పాటిల్ అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం ఢిల్లీ చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నేరుగా కార్యాలయాన్ని చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తారని తొలుత అందరూ అనుకున్నారు. అయితే కేసీఆర్ చేరుకునే సరికి చీకటిపడిపోవడంతో ఆయన నేరుగా తుగ్లక్ రోడ్‌లోని తన అధికార నివాసానికి వెళ్లిపోయారు.

13వ తేదీ నుంచి అందుబాటులో పార్టీ కార్యాలయం: నామ
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం బుధవారం నుంచి అందుబాటులో ఉంటుందని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని, పొరుగు రాష్ట్రాలు సైతం తెలంగాణ తరహాలో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి గురించి పార్లమెంటులో పొరుగు రాష్ట్రాల ఎంపీలు చర్చించుకుంటున్నారని నామ అన్నారు. కేంద్రంలో రైతు సంక్షేమ పార్టీ అధికారంలోకి రావాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులను తెలంగాణలో చేసి చూపించామని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని నామ నాగేశ్వర రావు అన్నారు.

రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, పంటల సాగులో, దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం అనేక రికార్డులు సృష్టించిందని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులందరికీ ప్రయోజనాలు కల్పించడం కోసమే పార్టీని అన్ని రాష్ట్రాల్లోకి విస్తరించనున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కొంతమంది జాతీయ నాయకులను ఆహ్వానించామని ఆయన తెలిపారు. అయితే మంగళవారం సాయంత్రం వరకు ఎవరెవరు హాజరవుతారన్న విషయంపై స్పష్టత వస్తుందని నామ తెలిపారు.

ఢిల్లీలో గులాబీ జెండా: బడుగుల లింగయ్య యాదవ్
భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. జాతీయ పార్టీ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని వినూత్న సంక్షేమ పథకాలను కేసీఆర్ తీసుకొచ్చారని ఆయన కొనియాడారు. అలాంటి పథకాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలంటూ అనేక రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని లింగయ్య యాదవ్ చెప్పారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు ఇక నుంచి దేశాభివృద్ధి కూడా తమ పార్టీ నినాదమని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement