Tuesday, May 21, 2024

గణేశ్‌ ఉత్సవాలకు అంతా రెడీ.. ఈనెల 31 పండుగ, సెప్టెంబర్‌ 9న నిమజ్జనం

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: ఆగస్టు 30న జరిగే వినాయక చవితి పండుగతో పాటు సెప్టెంబర్‌ 9న జరిగే గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. భాగ్యనగర్‌ గణేశ్‌ సమితితోపాటు వివిధ వర్గాలతో సర్కార్‌ మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో శాంతి సమావేశం ఏర్పాటు చేసింది. హోంమంత్రి మహమూద్‌ అలీ, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటి మేయర్‌ శ్రీలత, ఎంఎల్‌సీ ప్రభాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణరావు, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి రవిగుప్త, అదనపు డీజీపి జితెందర్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ నీతుకుమారి ప్రసాద్‌, పోలీస్‌ కమిషనర్లు సీవి.ఆనంద్‌, మహేష్‌ బగవత్‌, స్టీఫెన్‌ రవింద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, కలెక్టర్‌ అమయకుమార్‌, గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బగవంతరావు తదితరులు హజరయ్యారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఖైరతాబాద్‌ గణేశ్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా బారి కేడ్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలో ఉన్న 25 పాండ్స్‌కు అదనంగా మరో 50 పాండ్స్‌ను ప్రత్యేకంగా నిర్మిచ నున్నట్టు మంత్రి తెలిపారు. విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో అవసరమైన క్రేన్లు, లైటింగ్‌, జనరేటర్స్‌, గ జ ఈతగాళ్లను నియమించనున్నట్టు పేర్కొన్నారు. నిమజ్జనం రోజున జీహెచ్‌ఎంసీకి చెందిన 8 వేల మంది సిబ్బంది మూడు షిప్టులలో విధులు నిర్వహిస్తారని అన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన భాగ్యనర్‌ గణేశ్‌ ఉత్సవాలకు నగర ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భారీ బందోబస్తు..

భాగ్యనగర్‌లో గణేశ్‌ ఉత్సవాలకు భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక పోలీస్‌ సిబ్బందిని నియమించడంతో పాటు మఫ్టీ, షీ టీం పోలీసులను నియమించనున్నట్టు పేర్కొన్నారు. నగరంలో ఇప్పుడున్న సీసీ కెమెరాలకు తోడు అవసరం ఉన్నచోట ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో గణేష్‌ ఊరేగింపుల సందర్భంగా ఆయా ఏరియాలను బట్టి ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు తెలిపారు. గణేశ్‌ ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా నగర ప్రజలతో పాటు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని ఆయన కోరారు.

6 లక్షల విగ్రహాల పంపిణి..

- Advertisement -

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా నగరంలో మట్టి గణపతులను పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోందని తలసాని తెలిపారు. జీహెచ్‌ ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో ఒక లక్ష, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ( హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో మరో లక్ష మొత్తం 6లక్షల విగ్రహాలను పంపిణి చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబందించి ఆయా శాఖలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ ఇతర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నవరాత్రుల తర్వాత హుస్సేన్‌ సాగర్‌ తో పాటు నగరంలోని పలు జలాశయాల్లో వేయడం వల్ల పొల్యూషన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉచిత మట్టి విగ్రహాల పంపిణి చేపట్టినట్టు ఆయన తెలిపారు.

నిమజ్జనోత్సవానికి ఆటంకం కల్గిస్తే సహించం..

నగంలో గణేశ్‌ ఉత్సవాలకు ఆటంకం కల్గిస్తే సహించే ప్రసక్తి లేదని భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగ వంతరావు హెచ్చరించారు. మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లు, నిమజ్జనంపై అధికారులు కోర్టులో వ్యతిరేకంగా అఫిడవిట్లు దాఖలు చేశారని ఆరోపించారు. అధికారులు తమ పద్దతి మార్చుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకొని నగరంలో గణేశ్‌ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేరళలో అయ్యప్ప ఉత్సవాలకు, తమిళనాడులో జల్లికట్టు ఉత్సవాలకు కోర్టులు ఆటంకం కల్పించినా అక్కడి ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను అనుగునంగా ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. ఉత్సవాలకు సహకరించేలా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement