Friday, May 10, 2024

Delhi: ఇది బెంగాల్ కాదు, మునుగోడులో గెలుపు మాదే.. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో జరిగిన హింసపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యం గురించి ప్రసంగాలిచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనగామలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై జరిగిన దాడిని టీఆర్ఎస్ గూండాగిరిగా అభివర్ణించారు. శాంతియుతంగా జరుగుతున్న పాదయాత్రలో జరిగిన హింసకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని తరుణ్ చుగ్ ఆరోపించారు. బెంగాల్ తరహా హింసా రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించబోరని తరుణ్ చుగ్ అన్నారు.

పోలీసులు సైతం ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, ఎప్పటికీ టీఆర్ఎస్ అధికారంలో ఉండదన్న విషయాన్ని పోలీసులు సైతం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అధికారం చేజారిపోతుందన్న కలతతో నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఈ తరహా దాడులకు తెగబడుతున్నారని చుగ్ మండిపడ్డారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడం సాధ్యం కాదని ఆయన కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మునుగోడు ఉపఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోందని, కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక తేదీని ఖరారు చేసిన వెంటనే తమ వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేస్తామని తరుణ్ చుగ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి చేరిక కార్యక్రమాన్ని భారీస్థాయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే ఈ కార్యక్రమం వేదిక, తేదీ, సమయాన్ని ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. మునుగోడులో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనూ బీజేపీ గెలుపు సాధ్యం కాదని అన్నారని, కానీ చివరకు ప్రజాతీర్పు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మునుగోడు విషయంలోనూ అదే పునరావృతమవుతుందని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు బీజేపీలో చేరికల పర్వం మరింత ఊపందుకుంటుందని చుగ్ అన్నారు. ఈనెల 18న హైదరాబాద్‌లో కొందరు పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ నుంచి సైతం నేతలు తమతో మంతనాలు సాగిస్తున్నారని అన్నారు. ఇక నుంచి ప్రతి రోజూ చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement