Tuesday, April 30, 2024

హెపటైటిస్ నిర్మూలన ప్రజాఉద్యమంలా సాగాలి : వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మనిషి కాలేయాన్ని ప్రభావితం చేసి అసంక్రమిత వ్యాధులకు కారణమవుతున్న 2030 నాటికి హెపటైటిస్ వ్యాధి నిర్మూలన ప్రజాఉద్యమంలా జరగాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఇందుకోసం ప్రజలతో పాటు విధాన నిర్ణేతలు, ప్రజా ప్రతినిధులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. పార్లమెంటు నుంచి అసెంబ్లీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ తమ క్షేత్ర పరిధిలో ఈ వ్యాధి విషయంలో చైతన్యం కలిగించటంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా గురువారం పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ఉద్యమం, టీబీ నిర్మూలన ఉద్యమం ఏవిధంగానైతే ఉద్దేశిత లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్తున్నాయో.. హెపటైటిస్ నిర్మూలన కూడా అదేవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న మాతృభాషల్లో చేపట్టడం ద్వారా గ్రామస్థాయిలోనూ ఈ వ్యాధికి గల కారణాలు, ఎలా నిర్మూలించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు వీలవుతుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న మనదేశం ఆరోగ్యకరమైన, ఆనందకరమైన నిర్మాణం దిశగా ఇదే తీరులో ముందుకెళ్లాలని ఇందుకోసం వైద్యులు, వైద్యరంగంతో అనుసంధానమైన వారు, ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించాలని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎంపీల్లో హెపటైటిస్ పై అవగాహన కల్పించేందుకు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవీయ, డాక్టర్ ఎస్కే సరీన్ తోపాటు పార్లమెంటు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement