Thursday, May 16, 2024

విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలే.. ప్రజారోగ్య పరిరక్షణ సభలో ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్య, వైద్యాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగిస్తేనే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ అలుగుబె ల్లి నర్సిరెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రయివేటు ఆస్పత్రులు సేవలందించేందుకు నిరాకరిస్తే ప్రజల ప్రాణాలను కాపాడింది ప్రభుత్వాస్పత్రులేనని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన డాక్టర్లను మెడికల్‌ కాలేజీల్లో వాడుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మెడికల్‌ కాలేజీలకు ప్రొఫెసర్లు దొరికే పరిస్థితి లేదని, నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలను కాపాడిన తాత్కాలిక, ఇతర సిబ్బందిని యధావిథిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల పాత్రను గణనీయంగా తగ్గించి ప్రభుత్వాస్పత్రులను పెంచాలని డిమాండ్‌ చేశారు. డీఎంఇ, డీహెచ్‌ స్థానాల్లో ఇన్‌ ఛార్జీలను కొనసాగించడం సరికాదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను సకాలంలో చెల్లించాలన్నారు.

ఆదివారం హెల్త్‌ రిఫార్స్మ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ డాక్టర్స్‌ ఫోరం, కాంట్రాక్ట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, టిఇఎడాక్టర్స్‌ ఫోరం, తెలంగాణ స్టేట్‌ సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, ప్రొగ్రెసివ్‌ డాక్టర్స్‌ ఫోరం, నర్సింగ్‌ అసోసియేషన్‌, పారామెడికల్‌ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ప్రజారోగ్య పరిరక్షణ సభ జరిగింది. విద్య, వైద్య రంగాన్ని ప్రభుత్వరంగంలోనే కొనసపాగించాలని, ప్రయివేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌, రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమని చెబుతున్న ఆరోగ్యశ్రీ పథకాలు రెండూ ప్రయివేటు ఆసుపత్రులకు లాభం చేకూర్చేందుకే ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం వైద్యసంఘాలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ డిమాండ్ల సాధన కోసం శాసనమండలిలో, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తా మని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ తదితర పథకాలకు నిదులిచ్చిన వాడుకోలేని స్థితిలో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారుందని విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement