Sunday, May 19, 2024

Delhi | సమాఖ్య స్ఫూర్తికి వక్రభాష్యం చెప్పొద్దు.. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఫైర్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి వక్రభాష్యం చెప్పేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానిని పెద్దన్నలా వ్యవహరించాలని కోరారని గుర్తుచేశారు.

దానర్థం ఆయన కాంగ్రెస్ పార్టీకి సహకరించమని కోరినట్టు కాదని, రాష్ట్రాభివృద్ధికి సహకరించమని అర్థమని చెప్పారు. కానీ ఈ విషయంపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డినే అడగండి” అనడం ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడినట్టేనని మల్లు రవి అన్నారు. ప్రధాని పదవిలో ఎవరున్నా తాము గౌరవిస్తామని చెప్పారు. తాము ప్రకటించిన 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో అర్థం కావడం లేదని చెబుతున్న కిషన్ రెడ్డి.. తాము అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం ద్వారా 18 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని గుర్తుచేశారు.

గద్వాలలో 1,200 మంది రూ. 10 లక్షల చొప్పున ఉచితంగా వైద్య సౌకర్యం పొందారని, రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారని తెలిపారు. పథకాల అమలు అర్ధం కాకపోతే ఆర్టీఐ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని హితవు పలికారు. కిషన్ రెడ్డి రాజకీయంగా కాంగ్రెస్ పై బురద జల్లుతున్నారని అన్నారు. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నామని, అన్ని గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామని మల్లు రవి అన్నారు. చెప్పిన గ్యారెంటీలు అమలు చేయకపోతే అప్పుడు నిలదీయాలని అన్నారు.

బీజేపీ – బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని మల్లు రవి అన్నారు. ఏడాదిలోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, నిరుద్యోగ యువత సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, పేదలు, రైతులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రమే సంతోషంగా లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే మొత్తం డాం కూలిపోయే ప్రమాదముందని డ్యామ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారని, తాము డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

బీఎస్పీతో పొత్తు లేదు

కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండి కూటమిలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లేదని మల్లు రవి తెలిపారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి కూడా బీఎస్పీ సిద్ధంగా లేదని వివరించారు. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేతలను కలిశారని తెలిపారు. త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తోందని తెలిపారు.

- Advertisement -

స్క్రీనింగ్ జరిగిన తరువాత పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని అన్నారు. షెడ్యూల్ రాకముందే.. రాజకీయ స్వలాభం కోసం బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్నాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 14 సీట్లు గెలుపొందుతామని తెలిపారు. నాగర్‌కర్నూల్ పరిస్థితిని కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లానని, టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. సర్వేలు సైతం తనకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement