Wednesday, May 1, 2024

ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేయవద్దు.. నిన్నమొన్న వచ్చినోళ్లు ఒరిజినల్ కాదు : వీహెచ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు అన్యాయం జరగవద్దన్నదే తమ అభిమతమని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ వర్గం నేతలు (తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరినవారు) టీపీసీసీ పదవులకు రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. ఆ వర్గం నేతలకు పదవులు ఇవ్వకూడదని తాము చెప్పడం లేదని, కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు అన్యాయం చేయవద్దని మాత్రమే చెబుతున్నామని వీహెచ్ అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లను ‘ఒరిజినల్ కాంగ్రెస్’గా అభివర్ణిస్తూ.. నిన్నగాక మొన్న వచ్చినవాళ్లు ఒరిజినల్ ఎలా అవుతారు అంటూ ప్రశ్నించారు.

పార్టీలో కొన్నాళ్లపాటు పనిచేసిన తర్వాత పదవులు ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. వచ్చిన వెంటనే పదవులు ఇస్తే ముందు నుంచి ఉన్నవాళ్లకు అన్యాయం చేసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పీసీసీ చీఫ్ అందరినీ కలుపుకునిపోవాలని హితవు పలికారు. తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఓటమిపాలైనప్పుడు సోనియా గాంధీ సమీక్షలు నిర్వహించేవారని గుర్తుచేస్తూ.. ఆ సాంప్రదాయాన్ని టీపీసీసీ కూడా అమలు చేయాలని వీహెచ్ అన్నారు.

ఓబీసీ ఎంపీలతో సమావేశం

- Advertisement -

కులాలవారిగా జనగణన చేపట్టాలన్న డిమాండ్‌తో పాటు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఓబీసీల రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ వి. హనుమంత రావు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ నెల 20న (మంగళవారం) ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్టు వెల్లడించారు. దేశ జనాభాలో ఓబీసీలు సగం కంటే ఎక్కువ ఉన్నారని, కానీ వారికి దక్కాల్సిన వాటాలో రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు దక్కడం లేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలనలో 1931లో మాత్రమే కులాలవారిగా జనాభా లెక్కల సేకరణ జరిగిందని, ఆ తర్వాత దేశంలో ఎప్పుడూ కుల గణన చేపట్టలేదని, ఇప్పుడు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీహెచ్ అన్నారు.

ఓబీసీ రిజర్వేషన్లలో అమలు చేస్తున్న క్రీమీలేయర్‌ కారణంగా చాలామంది రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోతున్నారని, తక్షణమే క్రీమీలేయర్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓబీసీ నేత ప్రధాన మంత్రిగా ఉన్నందున ఈ సమస్యలన్నింటినీ ఆయన వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ అంశాలపై చర్చించడం కోసమే తాను సమావేశం ఏర్పాటు చేశానని, పార్టీలకు – రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి ఓబీసీ నేతలు హాజరుకావాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement