Thursday, May 9, 2024

క్రియాయోగతో మనిషిలో దివ్యత్వం.. యోగద సత్సంగ్ సొసైటీ అధినేత స్వామి చిదానంద గిరి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: క్రియాయోగతో మనిషిలో దివ్యత్వం మేల్కొంటుందని యోగధ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు స్వామి చిదానంద గిరి అన్నారు. ఆదివారం ఢిల్లీకి సమీపంలోని నోయిడా (ఉత్తర్‌ప్రదేశ్)లో యోగద సత్సంగ్ శాఖ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన క్రియా యోగ విశిష్టత గురించి వివరించారు. స్వామి పరమహంస యోగానంద 1917లో ఏర్పాటు చేసిన ఈ సొసైటీ నిర్వహించిన కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సొసైటీ సభ్యులు, ఆధ్యాత్మిక గురువు, భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి చిదానంద గిరి మాట్లాడుతూ.. మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడంలో క్రియో యోగ సాధన అద్భుత పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒడిదొడుకుల జీవన గమనంలో తీవ్రమవుతున్న ఆందోళన, ఆతృత, అసహనం వంటి రుగ్మతలను తొలగించే శక్తి క్రియా యోగకు ఉందని అన్నారు.

ప్రేమ, శాంతి, సహనం, సుహృద్భావం, అవగాహన వంటి సాత్విక గుణాలను వృద్ధి చేయడంలో క్రియాయోగ పాత్ర విశిష్టమైందని తెలిపారు. క్రియాయోగ సాధన ద్వారా అంతరంగ శుద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి, లక్ష్య సిద్ధి సులువుగా సాధ్యపడుతుందని స్వామి చెప్పారు. శరీరం, మెదడు, మనస్సులను అనుసంధానించే క్రియాయోగ ద్వారా అనేక సంక్లిష్టతలు, ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవడం సులువని అన్నారు. సానుకూల ఆలోచనా ధోరణిని, భవిష్యత్‌పై భరోసాను కల్పించే క్రియాయోగ, ధ్యానం, గురువుల భోధనల పుస్తకాలు నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించి శ్వాస మీద ధ్యాసను నిలుపుతూ, దైవత్వంతో తన్మయత్వాన్ని ఆస్వాదిస్తూ సాగే  ఈ ప్రక్రియతో మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement