Tuesday, May 7, 2024

Delhi | టీటీడీ నిధుల దారిమళ్లింపు : భానుప్రకాశ్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

దాదాపు రూ. 10 లక్షల కోట్ల రుణ ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని అన్నారు. చేస్తున్న అప్పులు చాలక.. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. ఇప్పటితే టీటీడీని ఇప్పటికే రాజకీయ పునరావస కేంద్రంగా మార్చారని, ఇప్పుడు దేవస్థానం నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో ఎక్కడా దేవాలయాల నుంచి వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ఇతర అవసరాలకు ఖర్చు చేయడం లేదని, కానీ నియమ నిబంధనలు ఉల్లంఘించి మరీ టీటీడీ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి దుయ్యబట్టారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయనకు ప్రయోజనం కల్గించేందుకు టీటీడీ నిధులను తిరుపతి పట్టణంలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక కేంద్రం అన్న విషయం మర్చిపోతున్నారని, ఇది వ్యాపార కేంద్రం కాదని భానుప్రకాశ్ రెడ్డి హితవు పలికారు. ధార్మికవేత్తలతో నింపాల్సిన ధర్మకర్తల మండలిని వ్యాపారవేత్తలతో నింపారని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని కరపత్రాలు పంచినవారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఏపీలో ఐపీసీ సెక్షన్లకు బదులు వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement