Thursday, May 9, 2024

చైనాలో పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులు

కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. తాజాగా డెల్టా వేరియంట్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. తూర్పు చైనా నగరమైన నాన్జింగ్‌ విమానాశ్రయంలో 9 మంది క్లీనర్ల నుంచి మొదలైన కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతోంది. కరోనా ఉనికిలోకి వచ్చిన అనంతరం తిరిగి సాధారణ స్థితికి చేరిన చైనాలో తాజాగా డెల్టా వేరియంట్‌ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మాస్‌ టెస్టింగ్‌, క్వారంటైన్‌ నిబంధనలు కఠినతరం చేసినా కొన్ని రోజులుగా డజన్ల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు వైరస్‌ వేరియంట్‌ వ్యాపిస్తోంది.

చైనా రాజధాని బీజింగ్‌లో ఆరు నెలల తర్వాత తొలిసారి గురువారం స్థానికంగా వ్యాప్తి చెందిన కరోనా కేసు నమోదైంది. ఇటీవల నాన్జింగ్‌కు వెళ్లిన వారి నుంచి కరోనా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో గురువారం నాటికి చైనాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 200కు చేరింది. కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకున్న కోవిడ్‌ జీరో ప్రాంతాలకు కొత్త వేరియంట్‌ వ్యాపించడంపై ఆ దేశ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా నివారణకు సొంతంగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన చైనా, వాటిని ప్రజలకు యుద్ధప్రాతిపదికన అందించింది. అయితే డెల్టా వేరియంట్ కేసులు వెల్లడి అవుతున్న నేపథ్యంలో ఆ టీకాలు సరైన రక్షణ కనబర్చలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: ప్రపంచ పులుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement