Saturday, May 4, 2024

Delhi | ఏపీలో పంచాయితీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం.. ఢిల్లీలో ఏపీ సర్పంచుల ఆరోపణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీరాజ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆ రాష్ట్ర సర్పంచులు ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయితీరాజ్ చాంబర్ నేతలు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిశారు. ఏపీలో గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని, ఈ విషయంపై విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.

తొలుత ఏపీ పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఢిల్లీ వచ్చిన సర్పంచుల్లో తెలుగుదేశం, జనసేనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లు కూడా ఉన్నారని.. పంచాయితీ నిధులను దారి మళ్లించడంతో మొత్తం పంచాయితీరాజ్ వ్యవస్థ నిర్వీర్యంగా మారుతోందని అన్నారు. ఒక చిన్న పని చేయడానికి కూడా సర్పంచుల దగ్గర నిధులు లేవని, మరోవైపు సమాంతరంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను గ్రామ వాలంటీర్లు, గృహ సారథుల పేరుతో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి తమ హక్కులు, అధికారాలను హైజాక్ చేసిందని మండిపడ్డారు.

- Advertisement -

మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామస్వరాజ్యం ఆలోచనలకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నడచుకుంటోందని ఆరోపించారు.ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేటాయించిన పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని దుయ్యబట్టారు. పంచాయితీ నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. అందుకే తాము ఢిల్లీ పర్యటన చేపట్టి కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి రేశ్వర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు. తాము రాజకీయాలకు అతీతంగా పంచాయితీరాజ్ వ్యవస్థ బాగు కోసం ఈ పోరాటం చేస్తున్నామని, హోంమంత్రి అమిత్ షా ను కూడా కలిసి తమ ఇబ్బందులు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు.

సర్పంచుల పోరాటానికి మా మద్దతు: కనకమేడల

రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి ఉందని, ఏపీలో మాత్రం స్వయం ప్రతిపత్తి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సమాంతర వ్యవస్థను నడుపుతోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. సర్పంచుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, వారి సమస్యను పార్లమెంటులో లేవనెత్తుతామని అన్నారు. మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 120 మంది సర్పంచులు ఢిల్లీకి వచ్చారని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఉద్దేశించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడం కారణంగా వారంతా ఢిల్లీ రావాల్సి వచ్చిందని చెప్పారు.

గ్రామ స్వరాజ్యానికి మూలస్తంభం సర్పంచుల వ్యవస్థ అని, కానీ గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే దారిమళ్లిస్తుంటే అంతకు మించిన అన్యాయం ఇంకేం ఉంటుందని అన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పంచాయతీలకు ఇచ్చిన నిధులు ఎటు పోయాయో తెలియడం లేదని, సర్పంచులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement