Monday, April 29, 2024

Delhi | నీళ్లు, నిధులు, నియామకాల్లో తీవ్ర అన్యాయం : బైరెడ్డి రాజశేఖర రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉమ్మడి రాష్ట్రంతో పాటు విభజన తర్వాత కూడా ముఖ్యమంత్రులను అందించిన రాయలసీమ నేల నీళ్లు, నిధులు, నియామకాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతోందని రాయలసీమ పరిరక్షణ సమితి కన్వీనర్, బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘సేవ్ రాయలసీమ’ పేరుతో వేల మంది రాయలసీమ వాసులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ధర్నా కోసం ప్రత్యేక రైలునే ఏర్పాటు చేసిన ఆయన.. హస్తిన వేదికగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తి మాట్లాడారు.

ఢిల్లీ ధర్నా కేవలం ఆరంభం మాత్రమే అని, ఇప్పటికైనా పాలకులు మేల్కొనకపోతే తమ పోరాటం ఉద్యమ రూపు సంతరించుకుంటుందని బైరెడ్డి హెచ్చరించారు. ఓ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై ప్రతిపాదించిన తీగల వంతెనకు బదులుగా బ్రిడ్జి కమ్ బ్యారేజి కట్టాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న ఆయన, కృష్ణా-తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులపై ఆందోళన వ్యక్తం చేశారు. అప్పర్ భద్ర, నెమలి వంటి ప్రాజెక్టుల కారణంగా కేవలం రాయలసీమకు మాత్రమే కాదు, తెలంగాణకు కూడా నష్టమేనని తెలిపారు.

- Advertisement -

ఇప్పటికే ఎడారిగా మారిన సీమ జిల్లాలకు నష్టం కల్గించే కర్ణాటక ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడ్డం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉద్యోగావకాశాలు లేకపోవడం వల్ల డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన రాయలసీమ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్లి మట్టిపనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ యూనివర్సిటీలు నిరుద్యోగులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారాయని అన్నారు.

ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కర్నూలు రాజధానిగా ఉంటే, తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినప్పుడు తమ రాజధానిని వదులుకోవాల్సి వచ్చిందని, మళ్లీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా రాయలసీమ ప్రాంతం అన్యాయానికి గురవుతోందని అన్నారు. దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన వారిలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రాయలసీమకు చెందినవారే అని, అయినా సరే ఏ ఒక్కరూ న్యాయం చేయలేకపోయారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిందించారు. రాయలసీమ నుంచి 52 అసెంబ్లీ స్థానాలే ఉండడం, మిగతా 123 స్థానాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కావడంతో సీఎంలు సైతం ఆంధ్రకే మొగ్గుచూపుతున్నారని అన్నారు.

తుగ్లక్ కూడా కొన్ని మంచి పనులు చేశాడు

రాజధాని మార్పు సహా కొన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారని చరిత్ర పేజీల్లో ఉన్న తుగ్లక్ కూడా కొన్ని మంచి పనులు చేశారని, కానీ ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, రాయలసీమకు హైకోర్టు అన్నారని, కానీ సీమలో కనీసం బెంచ్ కూడా ఉందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. మొత్తంగా వెనుకబాటుతనంలో విదర్భ, రాజస్థాన్ కంటే రాయలసీమ పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. “జగన్మోహన్ రెడ్డికి శ్రీబాగ్ ఒప్పందం తెలుసా? అందులో ఏ అంశాలు ఉన్నాయో తెలుసా?” అంటూ ఆయన ప్రశ్నించారు. తెలుగు సినిమాల్లో రాయలసీమను ఫ్యాక్షన్ హింసకు అడ్డాగా చిత్రీకరించడం కారణంగా కూడా సీమకు నష్టం వాటిల్లిందని, పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోయాయని అన్నారు.

రెజిమెంట్ ఇవ్వండి – ఉగ్రవాదులను తరిమి కొడతాం

ఢిల్లీ ధర్నా ద్వారా తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నది ఒక్కటేనని, తన సొంత రాష్ట్రం గుజరాత్ మాదిరిగా రాయలసీమను దత్తత తీసుకుని ఆదుకోవాలని బైరెడ్డి అన్నారు. దక్షిణ భారతదేశంలో ఒకే ఒక మిలటరీ రెజిమెంట్ ఉందని, అది మద్రాస్ రెజిమెంట్ అని గుర్తుచేస్తూ.. రాయలసీమ రెజిమెంట్ పేరుతో మరొకటి మంజూరు చేయాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాయలసీమ నిరుద్యోగ యువతకు అవకాశం లభిస్తుందని అన్నారు. రాయలసీమ రెజిమెంట్ పెడితే దేశంలో ఉగ్రవాదులను వెంటాడి, వేటాడి ఏరిపారేస్తామని అన్నారు. మొత్తంగా ఢిల్లీ ధర్నా ద్వారా కేంద్రం కళ్లు తెరిపించడంతో పాటు సీమ పాలకులు చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలన్నదే తన లక్ష్యమని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement