Sunday, April 28, 2024

Delhi | విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ సిద్ధం.. ఎంపీ విజయసాయి ప్రశ్నలకు కేంద్రం జవాబులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం ఔటర్ హార్బర్‌లో క్రూయిజ్ కమ్ కార్గో టెర్మినల్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రకటించారు. పర్యాటకుల సౌకర్యార్ధం సీ ప్లేన్‌ సర్వీసులను ప్రారంభించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.

విశాఖ పోర్టులోని ఔటర్ హార్బర్‌లో క్రూయిజ్ కమ్ కార్గో బెర్త్ నిర్మాణానికి అయ్యే వ్యయంలో కొంతమేర నిధులు సమకూర్చవలసిందిగా పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తికి 2018-19లో పర్యాటక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు.
ఈ క్రూయిజ్‌ టెర్మినల్‌‌ను ఏప్రిల్ నాటికే ప్రారంభించాల్సి ఉన్నా కోవిడ్‌ మహమ్మారి కారణంగా నిర్మాణంలో జాప్యం జరిగిందని తెలిపారు. పర్యాటకుల కోసం విశాఖలో సీ ప్లేన్‌ సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదనకు సంబంధించి ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నట్లు అజయ్ భట్ తెలిపారు.

- Advertisement -

ఐదేళ్లలో పోలార్ రీసెర్చి నౌక సిద్ధం

వచ్చే ఐదేళ్ళలో భారత్‌లో పోలార్‌ రీసెర్చి నౌకను సిద్ధం చేస్తామని భూవిజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ప్రకటించారు. ఆర్కిటిక్‌, ఆంటార్కిటిక్‌ ప్రాంతంలో భారత్‌ మూడు శాస్త్ర పరిశోధన కేంద్రాలను నెలకొల్పినప్పటికీ పదేళ్ళుగా పోలార్‌ రీసెర్చి నౌక (ఐస్‌ బ్రేకర్‌ నౌక) నిర్మాణంలో ఎందుకు విఫలమయ్యామని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. రూ. 1051 కోట్ల వ్యయంతో పోలార్‌ రీసెర్చి నౌక (ఐస్‌ బ్రేకర్‌ నౌక)ను సమకూర్చుకోవడానికి 2014లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు.

ఐస్‌ బ్రేకర్‌ నౌక నిర్మాణం కోసం టెండర్‌ పిలిచి ఒక కంపెనీకి పని అప్పగించడం జరిగింది. అయితే టెండర్‌లో పేర్కొన్న కొన్ని నిబంధనలపై ఆ కంపెనీ అభ్యంతరాలు లేవనెత్తడంతో నౌక నిర్మాణం నిలిచిపోయిందని మంత్రి వివరించారు. 2600 కోట్లతో ఐస్‌ బ్రేకర్‌ షిప్‌ను నిర్మించడానికి తాజాగా ఈఎఫ్‌సీ ప్రతిపాదనలు ఇచ్చింది. ఈ తరహా నౌకల తయారీలో ఆపార నైపుణ్యం కలిగిన రష్యా వంటి దేశాలతో షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని కేంద్రమంత్రి తెలిపారు.

స్టార్టప్‌లకు ఇస్రో ప్రోత్సాహం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో స్టార్టప్ సంస్థలకు సంస్థాగత, మౌలిక సహకారంతోపాటు సాంకేతిక మార్గదర్శకత్వం కూడా అందిస్తోందని పీఎంవో శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. స్పేస్ సైన్స్, టెక్నాలజీ, అప్లికేషన్ డొమైన్లలో మొత్తం 99 స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థలకు ఇస్రో ద్వారా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించేందుకు, వాటిని చేయిపట్టుకు నడిపించేందుకు ఇన్-స్పేస్ పేరుతో సింగిల్ విండో ఏజెన్సీని సృష్టించినట్లు ఆయన వివరించారు.

జూ. లాయర్లకు సామాజిక భద్రత కల్పించండి

న్యాయవాది వృత్తి ఏమంత ఆకర్షణీయమైన వృత్తి కాదని, పేరుమోసిన న్యాయవాదులు గంటకు లక్షల్లో ఆర్జిస్తుంటే జూనియర్‌ లాయర్లు బతుకు తెరువు కోసం సతమతమవుతున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అడ్వొకేట్స్‌ బిల్లుపై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గొడ్డు చాకిరి, అరకొర వేతనంతో జూనియర్‌ లాయర్లు సతమతమవుతున్నారన్నది కఠోర సత్యం అన్నారు. జూనియర్‌ లాయర్లు వృత్తిలోకి అడుగుపెట్టిన దశలోనే వారికి తగినంత ఆర్థిక సాయం అందిస్తూ ప్రతిభావంతులు న్యాయవాది వృత్తిలో కొనసాగేలా చూడాలని అన్నారు. జూనియర్‌ లాయర్లకు స్టైపెండ్‌, గృహ వసతి, ఇన్సూరెన్స్‌ వంటి ప్రయోజనాలను కల్పించేలా చట్ట సవరణను కోరుతూ తాను ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

లీగల్‌ ఫీజుపై నియంత్రణ పెట్టాలి

దేశంలో లీగల్‌ ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేనందున సీనియర్‌ అడ్వొకేట్లు ఉన్నత న్యాయస్థానాలలో వాదించడానికి గంటకు 5 నుంచి 50 లక్షలు వసూలు చేస్తున్నారని విజయసాయి అన్నారు. లా పట్టాతో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకోవడానికి ముందే ఆయా అభ్యర్ధులకు వృత్తిలో మెళకువలు పట్టుబడేలా శిక్షణ, అప్రెంటీస్‌షిప్‌ పొందేలా అడ్వొకేట్స్‌ చట్టాన్ని సవరించాలని సూచించారు. సంజయ్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో ఇలాంటి లాయర్లను ఉద్దేశించి సుప్రీం కోర్టు ఘూటైన వ్యాఖ్యలు చేస్తూ అరకొర జ్ఞానంతో ప్రాక్టీస్‌ చేసే లాయర్లు కోర్టు కార్యకలాపాలను దుర్వినియోగం చేయడంతోపాటు కక్షిదారులకు ధన నష్టం కలిగిస్తున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.

కార్పొరేట్లతోనే మీడియాలో పెడధోరణులు

కార్పొరేట్ల ప్రవేశంతోనే మీడియా స్వతంత్రం మంటగలిసిపోయి పెడధోరణలకు దారి తీస్తోందని విజయసాయి పేర్కొన్నారు. పత్రికలు, సంచికల రిజిస్టేషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. చట్టప్రకారం శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో కార్పొరేట్ సంస్థలకు ప్రవేశం నిషిద్ధం. కానీ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన పత్రికా రంగంలోకి ప్రవేశం మాత్రం వాటికి సునాయాసం అయిందని అభిప్రాయపడ్డారు. దీని పర్యవసానంగా మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్న కార్పొరేట్లు ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలైన ఇతర వ్యవస్థలను శాసించే స్థితికి చేరుకున్నాయని పేర్కొన్నారు.

కొన్ని కుల సంఘాలు, మత సంస్థలు, తీవ్రవాద విభాగాలు, రాజకీయ స్వప్రయోజనాలు ఆశించే కొన్ని సంస్థలు మీడియా రంగంలోకి ప్రవేశించి విచ్చలవిడిగా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తూ పత్రికా స్వతంత్రానికే ముప్పు తెచ్చిపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు మీడియా రంగంలో ప్రవేశించడాన్ని తాను వ్యతిరేకించడం లేదని అయితే లాభాపేక్ష లేకుండా పత్రికలు నడిపే సంస్థలకు మాత్రమే మీడియాలో ప్రవేశం కల్పించేలా చట్టంలో నిబంధనలను సవరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2020లో 1,527 ఫేక్‌ న్యూస్‌ కేసులు నమోదయ్యాయని, 2019తో పోల్చుకుంటే 214 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపిసి) ప్రకారం ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చే ప్రకటనలు చేసే వ్యక్తులు శిక్షార్హులు. కానీ పత్రికల ద్వారా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేసే వారికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ నిబంధనలు స్పష్టం చేయడం లేదని అన్నారు.

దేశం క్రమేణా డిజిటల్‌ యుగం వైపుగా సాగుతున్నందున డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం పరిధిలోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. భారత పత్రికా రంగానికి వాచ్‌డాగ్‌లా వ్యవహరించే ప్రెస్‌ కౌన్సిల్‌కు ఇకపై డిజిటల్‌ న్యూస్‌ను నియంత్రించే అధికారం కట్టబెట్టాలని విజయసాయి సూచించారు. అన్ని రకాల డిజిటల్‌ న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌లను నియంత్రిస్తూ ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసే సంస్థలపై భారీగా జరిమానాలు విధించేలా చట్ట సవరణ చేపట్టాలని కోరుతూ తాను ఇప్పటికే ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

ఆఫ్‌షోర్‌ మైనింగ్‌తో జీవనాధారానికి చేటు తీసుకురావద్దు

సాగర గర్భం నుంచి ఖనిజాల వెలికితీత కోసం నిర్వహించే ఆఫ్‌షోర్‌ మైనింగ్‌ కార్యకలాపాల ద్వారా సముద్రంపై ఆధారపడి జీవించే కోస్తా ప్రాంత ప్రజల జీవనాధారానికి చేటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఆఫ్‌షోర్‌ ఏరియాల్లో ఖనిజాల బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌కు వీలు కల్పించే ఈ బిల్లు దేశ ఆర్థిక పురోగతి, ప్రగతికి మంచిదేనన్నారు.

అదే సమయంలో తీరప్రాంతంలో నివసించే మత్స్యకారులతో సహా లక్షలాది కుటుంబాల సామాజిక, ఆర్థిక సంక్షేమాన్ని పరిరక్షించే అంశాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను విస్మరించకూడదని అన్నారు. సముద్రంపై ఆధారపడి జీవించే వారి జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, కోస్తాతీర రాష్ట్రాలు, అక్కడి ప్రజలు, సముద్రంలోని జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలని శ్రీ విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 297 ప్రకారం భారత సముద్ర జలాల్లో దాగివున్న ఖనిజ నిక్షేపాలపై సర్వహక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డీప్‌ ఓషన్‌ మిషన్‌ను ప్రారంభించి 2021 నుంచి 2026 వరకు అయిదేళ్ళపాటు కార్యకలాపాల నిర్వహణ కోసం 4077 కోట్లు కేటాయించడాన్ని ఎంపీ అభినందించారు. ఆర్థికంగా గిట్టుబాటు కానందునే ప్రైవేట్‌ సంస్థలు ఆఫ్‌షోర్‌ మినరల్‌ మైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement