Thursday, May 2, 2024

Delhi సీఎం కేజ్రీవాల్ పీఏపై వేటు.. విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు పడింది. 17 ఏళ్ల క్రితం నమోదైన క్రిమినల్ కేసులో భాగంగా కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీను అరెస్టు చేశారు. 2007 నాటి క్రిమినల్‌ కేసులో విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. బిభవ్ కుమార్‌ నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌.. గురువారం ఆయనను విధుల నుంచి తొలగిస్తూ విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

2007లో తన విధులు నిర్వహించకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడటంతో వైభవ్‌కుమార్‌తోపాటు మరో ముగ్గురిపై నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేసే మహేష్ పాల్ అనే ప్రభుత్వ అధికారి కేసు నమోదు చేశారు. దీంతో పోలీస్‌లు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిపాలన పరమైన చర్యలో భాగంగా సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీగా వైభవ్ కుమార్‌ను తొలగించారు.

సీఎం పీఏగా బిభవ్ కుమార్ నియామకంలో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసుల విషయాలు వెల్లడించకుండా నియామకం జరపడం పాలనావ్యవహారాల పరంగా ఇబ్బందికర పరిణామమని తెలిపింది. ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండా, ఆ వ్యక్తి గత చరిత్ర చూడకుండా మంత్రులు, ముఖ్యమంత్రులకు పర్సనల్ సెక్రటరీలను నియమించడం సరికాదని వెల్లడించింది. బిభవ్ కుమార్‌పై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని.. వాటిపై విచారణ జరుగుతోందని పేర్కొంది. ఆ కేసు వివరాలను పరిగణనలోకి తీసుకోకుండానే పీఎస్‌గా ఆయనను నియమించారని విజిలెన్స్‌ విభాగం ఆరోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement