Thursday, May 9, 2024

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

కర్నూల్ బ్యూరో : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి జరగాలంటే అది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమని ఏపీ ప్రజలు గుర్తించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఏపీలో మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే.. డిమాండ్‌తో సోమవారం స్థానిక ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలో సీమ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్థిక, కార్మిక, దేవదాయ శాఖల మంత్రులతోపాటు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, మేధావి వర్గాలు, విద్యార్థి, కార్మిక సంఘాల ప్రతినిధులు గర్జనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గర్జన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 1953లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలును తొలి రాజధానిగా మార్చారని మంత్రి గుర్తు చేశారు. అనంతరం 1956లో రాజధాని హైదరాబాద్‌కు మార్చబడింది. ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజల త్యాగంగా ఆయన కొనియాడారు. 1956 నుంచి నేటి వరకు రాయలసీమ ప్రాంతం ఏ రూపంలోనూ అభివృద్ధి చెందలేదని ఆవేదన చెందారు. అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉందన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రిలు, కేంద్ర మంత్రులు గానీ, మంత్రులెవరూ దాని అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అనుసరించి వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలును న్యాయశాఖ రాజధానిగా ప్రకటించారని తెలిపారు.

శివ రామకృష్ణ కమిటీ, శ్రీ కృష్ణ కమిటీ, జెంటిల్మన్ అగ్రిమెంట్, లాంటి మేధావులు చెప్పిన సూచనల మేరకు సీఎం జగన్ సమకాలిన అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నదే ధృడ సంకల్పంగా పేర్కొన్నారు. అదే విధంగా భవిష్యత్తులో ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం అమరావతిని శాసనసభగా, విశాఖపట్నం ఆర్థికంగా, కర్నూలు నుంచి న్యాయ రాజధానిగా మూడు రాజధానులు ప్రకటించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని వైసీపీ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుపై బుగ్గన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన హయాంలో కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయడంలో నాయుడు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ గా చేశారు. ఇంకా చాలా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి పనులకు నిధుల కేటాయింపు వైయస్ రాజశేఖర్ రెడ్డి హ‌యాంలోనే విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలోనే సీమ ప్రాంత అభివృద్ధి న్యాయ రాజధానితోనే సాధ్యమని గుర్తించడం జరిగింది అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement