Thursday, May 2, 2024

డిసెంబర్ 31న.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో డిసెంబరు 31వ తేదీ రాత్రి 10గంటల నుంచి 2గంటలవరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ మీదుగా నెక్లెర్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ దిశగా వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్ భవన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లేందుకు అనుమతించరు.ఆంక్షల సమయంలో మింట్ కాంపౌండ్ రోడ్డును మూసివేస్తారు. లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ దిశగా వెళ్లే వాహనాలను కవాడిగూడ జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం మీదుగా దారి మళ్లిస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘలనపై డిసెంబరు 31న నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

ఇక సైబరాబాద్ పరిధిలో…డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అవుటర్ రింగ్ రోడ్డుపై, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పైనా వాహనాలు అనుమతించరు. అయితే, ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, జేఎన్ టీయూ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ పార్క్ ఫ్లైఓవర్ లెవల్ 1, లెవల్ 2, రోడ్ నం.45 ఫ్లైఓవర్, షేక్ పేట ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్ ఫ్లైఓవర్, బాలానగర్ బాబూ జగజ్జీవన్ రామ్ ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్ లో వాహనాలను అనుమతించరు.అయితే, ట్యాక్సీలు, క్యాబ్ లు, ఆటో డ్రైవర్లు ప్రజలను ప్రయాణానికి నిరాకరించకూడదని సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా డ్రైవర్ ప్రయాణానికి నిరాకరిస్తే 9490617346 నెంబరుకు తెలియజేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement