Sunday, April 28, 2024

డబ్బుల్లేవ్‌, చమురు కొనలేం.. శ్రీలంక ప్రధాని ప్రకటన

దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, మునుముందు ఇంధనం, గ్యాస్‌, విద్యుత్‌, ఆహార సంక్షోభం మరింత తీవ్రం కాబోతోందని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ప్రకటించారు. ప్రస్తుతం చమురు కొనే పరిస్థితుల్లో కూడా దేశం లేదని వెల్లడించారు. ఇదే ప్రస్తుతం మనముందున్న అతిపెద్ద సమస్యగా ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో బుధవారంనాడు మాట్లాడిన ఆయన దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖను స్వయంగా నిర్వహిస్తున్న రణిల్‌, ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దేశాన్ని గాడిలో పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

విచ్చలవిడిగా చేసిన విదేశీ రుణాలు, పర్యాటక రంగం చతికిలపడటం, ఆదాయం లేకపోవడం, విదేశీ మారక ద్రవ్యం కరిగిపోయిన నేపథ్యంలో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. నిత్యావసర వస్తవుల కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. కాగా ఇప్పుడు పరిస్థితు మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆయన తాజా పరిస్థితులను వివరించారు. ప్రస్తుతం శ్రీలంక పెట్రోలియం కార్పొరేషన్‌ 700 మిలియన్‌ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని, అందువల్ల ఏ దేశం లేదా మరే సంస్థా కూడా మనకు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు సిద్ధంగా లేవని చెప్పారు.

నేరుగా నగదు చెల్లిస్తామన్నా కూడా అవి విశ్వసించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆర్థిక సంక్షోభాని ఎదుర్కోవడంలో ప్రధాని విఫలమవుతున్నారని ఆరోపిస్తూ ప్రధాన విపక్షం సమగి వనిత బలవెగయ కు చెందిన చట్టసభ సభ్యులు రణిల్‌ ప్రైవేటు నివాసం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement