Monday, April 29, 2024

బంగ్లాదేశ్ లో సిత్రాంగ్ తుఫాన్ విళయతాండం.. 16మంది మృతి

సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ లో విళయతాండవం చేస్తోంది. సుమారు లక్ష మంది తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్తు లేకుండా చీకట్లోనే మగ్గుతున్నారు. దక్షిణ, నైరుతి ప్రాంతాలలో భారీ వర్షాల వల్ల పాఠశాలలను మూసివేశారు. ఇప్పటి వరకు సంభవించిన మరణాలపై విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమ్రుల్ అహ్సాన్ వార్తా సంస్థ ‘ఏఎఫ్పీ’తో మాట్లాడుతూ.. తుఫాను వల్ల కురుస్తున్న వర్షాలు, చెట్లు కూలిపోవడం వల్ల 14 మంది చనిపోయారని, ఉత్తరాన జమున నదిలో ఒక పడవ మునిగిపోవడంతో ఇద్దరు మరణించారని చెప్పారు.ఈ తుఫాను ప్రభావం వల్ల చనిపోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 16కి చేరింది.

దక్షిణ ద్వీపమైన మహేశ్‌ఖాలీలో తుఫాను ప్రభావం వల్ల అనేక చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్, టెలికాం సేవలు నిలిచిపోయాయి. కరెంటు లేకపోవడంతో ఒక్క సారిగా ఆ ప్రాంతంలో చీకట్లు అలుముకున్నాయి. ఈ సమయంలో చాలా ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. పలువురు ఇళ్లలోకి పాములు కూడా వచ్చాయని బాధితులు ఏఎఫ్పీకి తెలిపారు. అత్యధికంగా ప్రభావితమైన బారిసల్ ప్రాంతంలో కూరగాయల పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కు సమీపంలో ఉన్న భారత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ లో కూడా ఈ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. సోమవారం వేలాది మంది ప్రజలను 100 కంటే ఎక్కువ సహాయ కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టమూ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. సహాయ శిబిరాలకు వెళ్లిన పలువురు మంగళవారం తమ ఇళ్లకు తిరిగివచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement