Monday, May 20, 2024

CWC 2023 | పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా హ్యాట్రిక్ విన్

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా మూడో మ్యాచులోనూ విజ‌యం సాధించింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ అగ్ర‌స్థానానికి చేరుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్.. పాకిస్తాన్ జ‌ట్టును 191 ప‌రుగులకే క‌ట్టిడి చేసింది.

ఇక చేజింగ్ లోనూ విశ్వ‌రూపం చూపించింది టీమిండియా.. 192 ల‌క్ష్యాన్ని 30.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (53 నాటౌట్‌; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. శుభ్‌మ‌న్ గిల్ (16), విరాట్ కోహ్లీ (16)లు విఫ‌లం అయ్యారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. హసన్ అలీ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఇక‌, అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (50; 58 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ‌శ‌తం చేశాడు. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (49; 69 బంతుల్లో 7 ఫోర్లు) ఒక్క ప‌రుగు తేడాతో హాఫ్ సెంచ‌రీ చేజార్చుకున్నాడు. ఇమామ్ ఉల్ హక్ (36), అబ్దుల్లా షఫీక్ (20) లు ఓ మోస్త‌రుగా రాణించ‌గా.. సౌద్ షకీల్ (6), ఇఫ్తీకర్ అహ్మద్ (4), షాదాబ్ ఖాన్ (2) లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్, హార్ధిక్ పాండ్య‌, ర‌వీంద్ర జ‌డేజా లు త‌లా రెండు వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement